ఇటీవల బాసర ట్రిపుల్ ఐటీలో చోటు చేసుకున్న ఫుడ్ పాయిజన్ ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. ఒక్క ట్రిపుల్ ఐటి లోనే కాదు… అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ ల్లో అదే రకమైన పరిస్థితి నెలకొందని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా.. రెసిడెన్షియల్ స్కూల్స్ లో చదువుతున్న పిల్లల తల్లిదండ్రులు ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో తెలియని ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయని, బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థులు నెల రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. బాసర వెళ్తున్నామని తెలిస్తే చాలు.. మమ్మల్ని మధ్యలోనే అరెస్ట్ చేస్తున్నారని, గురుకులాల్లో టీచర్స్ తో కేసీఆర్ వెట్టిచాకిరి చేయిస్తున్నారని ఈటల మండిపడ్డారు. అన్ని విశ్వవిద్యాలయాల్లో అదే రకమైన పరిస్థితి ఉందని, గవర్నర్ దగ్గర పిల్లలు మొరపెట్టుకున్నారని, సీఎం కేసీఆర్ మనువడ్ని ఆ హాస్టల్ లోనే పేద విద్యార్థుల పక్కనే ఉంచండని ఆయన వ్యాఖ్యానించారు.
వ్యంగ్యంగా మాట్లాడటం లేదు… బాధతో చెబుతున్నానని ఆయన తెలిపారు. ఒక్కడి ఇంటి దగ్గర 30 మంది ఇంటలిజెన్స్ సిబ్బంది ని పెట్టారని, తక్షణమే విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల మెనూ చార్జీలు పెంచాలని, ఇంటలిజెన్స్ వ్యవస్థను ఉపయోగించి స్కూల్స్, హాస్టళ్ల వ్యవస్థపై రిపోర్ట్ తెప్పించుకోవలని ఈటల సూచించారు. దాసోజు శ్రవణ్ పీసీసీ చీఫ్ నిర్ణయాలు నచ్చక బయటకు వచ్చారు ఇంకా చాలా మంది నేతలు వస్తారని, సిద్దిపేటకు చెందిన మాజీ మున్సిపల్ చైర్మన్, టీఆర్‌ఎస్ నేత మురళి యాదవ్ బీజేపీ లో చేరుతున్నారని ఆయన తెలిపారు. కన్నెబొయిన రాజయ్య యాదవ్, ఎర్రబెల్లి ప్రదీప్ రావు, దాసోజు శ్రవణ్ తోపాటు 10 నుంచి 20 మంది నేతలు ఈనెల 21 వ తేదీన అమిత్ షా సమక్షంలో చేరుబోతున్నట్లు సంచలన విషయాలు వెల్లడించారు.