తెలంగాణ రాష్ట్ర ప్రజానికమంతా ప్రస్తుతం హుజురాబాద్ బై పోల్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నది. ఒక్క ఉప ఎన్నిక కోసం ఇంతస్థాయిలో ప్రచారం ఉంటుందని అస్సలు అనుకోలేదు ప్రజలు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యం కాగా, ఇక్కడ మళ్లీ గులాబీ జెండాను రెపరెపలాడించేందుకుగాను అధికార టీఆర్ఎస్ పార్టీ సర్వశక్తులను ఒడ్డుతున్నది. స్వయంగా సీఎం కేసీఆర్ హుజురాబాద్ నియోజకవర్గంలో ‘దళిత బంధు’ స్కీమ్ లాంచ్ చేశారు. టీఆర్ఎస్ తరఫున గెల్లు శ్రీనివాస్ యాదవ్ అభ్యర్థిగా ఉన్నారు.
బీజేపీ తరఫున మాజీ మంత్రి ఈటల రాజేందర్ బరిలో ఉన్నారు. ఈ ఉప ఎన్నికలో ఒకవేళ ఈటల ఓడితే ఆయన రాజకీయ భవిష్యత్తు ముగిసినట్లేననే అంచనా వేస్తున్నారు రాజకీయ పరిశీలకులు. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈటల గెలుస్తారనే ధీమా బీజేపీ వర్గాలు వ్యక్తం చేస్తున్నారు. ఇరవై ఏళ్ల నుంచి హుజురాబాద్ నియోజకవర్గంలో పాగా వేసుకున్న ఈటల గెలుపు ఖాయమని ఆయన అనుచరగణం పేర్కొంటున్నది. అయితే, ఈటల ఓటమిపై బీజేపీ భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంది.
ఈటల రాజీనామా అనంతరం ఆయన వెంట ఏనుగు మనోహర్‌రెడ్డి,, తుల ఉమ లాంటి కీలక నేతలు ర్యాలీ అయ్యారు.
వారే కాకుండా అప్పటికే బీజేపీలో ఉన్న బొడిగె శోభ, ఎమ్మెల్యే రఘునందన్‌రావు, ఇంకా కొందరు ముఖ్య నేతలు కూడా ఇప్పుడు ఈటల గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. నియోజకవర్గంలో ఈటల వెంట నడుస్తున్నారు. అయితే వీరంతా తెలంగాణ ఉద్యమంలో కూడా పని చేశారు. ఈ నేపథ్యంలోనే ఈటల ఎమ్మెల్యేగా గెలిస్తే తాము అంతా బీజేపీలో మంచి టీమ్‌గా ఉండొచ్చనే ప్లానింగ్ లో ఉన్నారని సమాచారం. అయితే, ఒకవేళ ఈటల రాజేందర్ ఓడిపోతే వారి ఈటలతో పాటు తమ రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలోకి నెట్టివేయబడుతుందని అనుకుంటున్నారట. ఈ క్రమంలోనే రాజేందర్ గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారట.