గత కొన్ని రోజులుగా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు పావులు కదుపుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు.. జాతీయ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే సీఎం కేసీఆర్ పర్యటనపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందిస్తూ.. విమర్శలు గుప్పించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్లు రెండు మూడు నెలలకు ఒకసారి వస్తున్నాయని, ఉద్యోగులకు జీతాలు లేవు. మధ్యాహ్న భోజనం వండేవారికి కూడా డబ్బులు ఇవ్వడం లేదు. రాష్ట్రం అప్పులమయమయ్యి గతి లేక గత్యంతరం లేక ప్రజలమీద విపరీతం అయిన పన్నుల భారం మోపారు. లిక్కర్ బాటిల్స్ మీద రెట్లు పెంచారంటూ.. ఆయన మండిపడ్డారు.
భూముల రిజస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు.. కరెంటు ఛార్జీలు పెంచారు.. బస్సు ఛార్జీలు పెంచారు.. ఒక్క మాటలో చెప్పాలి అంటే సంవత్సరానికి 25 వేల కోట్ల రూపాయల భారం ప్రజల మీద వేశారంటూ ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ పరిపాలన చేతకాక.. నేను ఏదో వెలగ బెడతా అని బెంగాల్ పోతా, పంజాబ్ పోతా, కర్ణాటక పోతా అని.. ప్రజల డబ్బుతో ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. కూట్లో రాయి తీయలేనివాడు ఎట్లో రాయి తీస్తా అన్నట్లు ఉంది అంటూ ఈటమ ఎద్దేవా చేశారు.