నిర్మల్‌లో రైతులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం సరికాదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి నిర్మల్‌లో చేపట్టిన ఆమరణ దీక్షకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న బీజేపీ జాతీయ ఉపాధ్యాక్షురాలు డీకే అరుణను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఆయన ఖండించారు. అలాగే రైతులపై పోలీసులు చేసిన లాఠీఛార్జ్‌ను ఈటల తప్పుబట్టారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ మనుషులు పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
వాళ్లే మఫ్టీలో వెళ్లి రైతులపై దాడి చేశారని ఆరోపించారు. ఈ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే సమయంలో త్వరలోనే ఉందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఇంకా మూడు నెలలే ఉంటుందని ఈటల జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ ఆరిపోయే దీపం లాంటిదని.. అందువల్లే ఇప్పుడు వెలిగిపోతోందని ఈటల రాజేందర్ విమర్శించారు.
“తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు చట్టానికి లోబడి కాకుండా కేసీఆర్ చెప్పినట్లుగా పనిచేస్తున్నారు అని చెప్పడానికి అనేక ఉదంతాలు ఉన్నాయి. ఒకనాడు లంబాడ తండాలలో లంబాడాలు పిల్లలను అమ్ముకొని బతుకుతున్నారని చెప్పిన కేసీఆర్.. అదే లంబాడ మహిళల మీద పోలీసులు చేసిన దౌర్జన్యానికి పాల్పడితే.. వారిమీద చర్యలు తీసుకోకుండా.. ఆమె మంచిది కాదు అని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ లంబాడ తల్లులు పిల్లలను సాదలేక ఇలాంటి పనికి ఒడిగడుతున్నారని మీరు చెప్పదలుచుకున్నారా కేసీఆర్..? లంబాడా తల్లుల శీలాన్ని కేసీఆర్ శంకిస్తున్నారు. మీ దుర్మార్గాన్ని ఆ మహిళలు అర్థం చేసుకుంటారు.