నిర్మల్ మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆమరణ దీక్ష చేపట్టిన నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మహేశ్వర్ రెడ్డికి మద్దతు తెలపడానికి వెళుతున్న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణను పోలీసులు మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు. ఈ క్రమంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ.. నిర్మల్ మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి రైతుల కోసం గత ఐదు రోజుల గా ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే అతడినీ పరామర్శించడానికి వెళ్తే నన్ను అడ్డుకున్నారని ఆమె ధ్వజమెత్తారు.
ఈ ప్రభుత్వం గుడ్డి ప్రభుత్వమని, సీఎం కేసీఆర్ నియంతల వ్యవహరిస్తున్నాడు…ఈ దుబాయ్ షేక్ అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మల్ ఇందలవాయి వద్ద నన్ను పోలీసులు అడ్డుకున్నారని, పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఈ ప్రభుత్వం రాష్ట్రం లో భూ దందా చేస్తోందని ఆమె ఆరోపించారు. సీఎం కేసీఆర్ భూ దొంగ అని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ భూములను కేసీఆర్ దోచుకుంటున్నారని, కాళేశ్వరం దోచుకోవడం అయే పోయిందని, ప్రభుత్వ భూములను కార్పోరేట్ కు అమ్మతున్నడంటూ ఆమె ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ దుబాయ్ శేఖర్ అంటూ ఆమె ఎద్దేవా చేశారు. నిర్మల్ వెళ్తుంటే నన్ను ఎందుకు అడ్డుకున్నారు? రైతుల తరపున మహేశ్వర్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్షను చేస్తుంటే అడ్డుకున్నారని ఆమె మండపడ్డారు. రైతు లు ఆందోళన చేస్తుంటే కేసీఆర్ నీకు బాధ్యత లేదా అని ఆమె ప్రశ్నించారు.