రెండుసార్లు వరుసగా ఎంపీగా చేశారు. మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. ఓటమి తీసుకొచ్చిన భారమో ఏమో కానీ.. ఏడాదిన్నరగా ఆయన ఎక్కడున్నారో తెలియడం లేదు. జనం సరే.. కార్యకర్తలకు మెరుపుతీగలా కూడా కనిపించడం లేదట.
మధుయాష్కీ గౌడ్ . నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి 2004, 2009 ఎన్నికల్లో వరుసగా గెలిచి రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నారు. తర్వాత 2014, 2019 ఎన్నికల్లో వరుస ఓటములను చవి చూశారు. 2014 ఎన్నికల్లో కొంతమేర పోటీ ఇచ్చిన మధుయాష్కీ.. 2019లో మాత్రం దారుణ పరాజయాన్ని ముటగట్టుకున్నారు. డిపాజిట్ దక్కలేదు. 2014 ఎన్నికల్లో ఆయనకు 2 లక్షల 80 వేల ఓట్లు వస్తే.. 2019 ఎలక్షన్‌లో కేవలం 68 వేల ఓట్లు సాధించారు.
నిజామాబాద్ లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్‌లలో మధుయాష్కీ గౌడ్ కి మంచి పట్టు ఉంది.
అయినా 2019 ఎన్నికల్లో కనీసం పోటీ ఇవ్వకుండా చేతులు ఎత్తేయడంపై అనేక విమర్శలు వెల్లువెత్తాయి. పెద్దగా ప్రచారం చేయలేదు. నాటి ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి కవిత ఓటమే లక్ష్యంగా బీజేపీ అభ్యర్థికి పరోక్షంగా సపోర్ట్ చేశారని అనుకుంటారు. కాంగ్రెస్ పార్టీ నేతలే కామెంట్స్ చేశారు. DS కోరడం వల్లే యాష్కీ సైలెంట్ అయ్యారన్న ఆరోపణలను అప్పుడే ఆయన ఖండించారు.
కాకపోతే.. నాడు బరిలో ఉన్న రైతులందరికీ కలిపి 98 వేల ఓట్లు వస్తే.. యాష్కీకి అన్ని కూడా రాలేదు. రెండోసారి ఓడిన తర్వాత నిజామాబాద్‌లో ఇప్పటి వరకూ జరిగిన ఏ కార్యక్రమాల్లోనూ పెద్దగా పాల్గొన్న దాఖలాలు లేవు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే మా మదన్న ఎక్కడా అని వెతుకుతున్నారట. ప్రస్తుతం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి వెంటిలేటర్‌పై ఉందని ఆ పార్టీ నేతలే సెటైర్లు వేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో అండగా ఉండాల్సిన నాయకులు ఏమయ్యారు అని ప్రశ్నిస్తున్నారట.
కొన్ని జిల్లాల్లో ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ నేతలు అప్పుడప్పుడూ వచ్చి కనిపించి వెళ్లిపోతున్నారని.. కానీ ఇందూరు జిల్లాలోనే భిన్నమైన పరిస్థితి ఉందని లోకల్ పార్ట కేడర్ గుస గుసలాడుకుంటోంది. జిల్లా రాజకీయాల్లోకి మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ మళ్లీ ఎంట్రీ ఇస్తారా.. ఇవ్వరా అనే చర్చ అయితే జోరుగా సాగుతోందట. కనీసం కనిపించకపోయినా.. కార్యకర్తలకు ఫోన్ చేసి పార్టీ పరిస్థితి ఆరా తీసినా బాగుండేదని అనుకుంటున్నారట. మరి.. వారి మాటను మధుయాష్కీ మన్నిస్తారో లేదో చూడాలి.