కరోనా వైరస్ నేపథ్యంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో అనేక ఫేక్ వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణలో ఓ వార్త వాట్సాప్ గ్రూప్‌లలో చక్కర్లు కొడుతోంది. ఆదివారం నుంచి నిత్యం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రాష్ట్రంలో ఉన్న వైన్ షాపులను తెరుస్తారని, పోలీసుల సహాయంతో షాపులను నడిపిస్తారని.. సామాజిక దూరం పాటిస్తూ మందు బాబులు మద్యం కొనుగోలు చేయవచ్చని.. సదరు వార్తలో ఉంది. అలాగే ఈ విషయం నిజమే.. అనిపించేలా.. తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ విడుదల చేశారంటూ.. ఓ లెటర్ కూడా వైరల్ అవుతోంది.. అయితే ఇందులో ఎంత మాత్రం నిజం లేదని వెల్లడైంది.
వాట్సాప్‌లో విస్తృతంగా ప్రచారం అవుతున్న సదరు వార్తకు సంబంధించి తెలంగాణ వైన్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డి.వెంకటేశ్వర్ రావును మీడియా ప్రతినిధులు వివరణ కోరగా.. ఆ వార్తలో నిజం లేదని, అది అబద్దమని చెప్పారు. ఇలాంటి ఫేక్ న్యూస్‌ను నమ్మవద్దని ఆయన కోరారు. అయితే మరోవైపు రాష్ట్రంలో ఉన్న వైన్ షాపుల యజమానులు, మద్యం ప్రియులు ఈ వార్తను నిజమే అని నమ్మి చంకలు గుద్దుకున్నారు. ఆదివారం నుంచి వైన్ షాపులు ఓపెన్ అవుతాయి.. చక్కగా మద్యం సేవించవచ్చని అనుకున్నారు. కానీ ఈ వార్త అబద్దం అని తేలే సరికి వారు నిరాశ చెందారు.
కాగా తెలంగాణలో ఇప్పటికే పలు చోట్ల మద్యం ప్రియులు, కల్లు తాగే వారు గత కొద్ది రోజులుగా అవి లభించకపోవడంతో.. వింత వింతగా ప్రవర్తిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. మరి ఇలాంటి వారి కోసం ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి..!