పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన పెద్దన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అలాగే కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు ఆర్థిక సాయం ప్రకటించిన ప్రతి ఒక్క హీరోకి, సినీ సంబంధిత వ్యక్తులకి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపాడు. కరోనా ని తరిమికొట్టడానికి ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రధాని తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల ముంఖ్య మంత్రులు లాక్‌డౌన్ ని ప్రకటించారు. ఈ నేపథ్యంలో సినీ కార్మికుల కోసం ప్రముఖ నటుడు, ఇండస్ట్రీకి పెద్ద దిక్కు.. మెగాస్టార్ చిరంజీవి రూ. కోటి విరాళంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు జనసేన అధ్యక్షుడు, స్టార్ హీరో పవన్ కళ్యాణ్ చిరంజీవి కి కృతజ్ఞతలు తెలిపారు.
తెలుగు చిత్ర పరిశ్రమ కష్టాల్లో కుమిలిపోతున్న సమయంలో ఆపద్బాంధవుడిలా ఆదుకునేందుకు వెంటనే ముందుకొచ్చిన తన అన్న చిరంజీవి సినీ కార్మికుల కోసం రూ.కోటి విరాళంగా ప్రకటించినందుకు తమ్ముడిగా గర్వపడుతున్నట్టు పవన్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ‘సినీ పరిశ్రమలోని 24 విభాగాలలోని ప్రతీ టెక్నీషియన్, ప్రతీ కార్మికుని శ్రమ తెలిసిన వ్యక్తి చిరంజీవి అని… కరోనా మహమ్మారి కారణంగా ఉపాధి కోల్పోయి సినిమానే నమ్ముకుని జీవిస్తున్న ఎంతో మంది కార్మికులు, టెక్నీషియన్లు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని … అలాంటి వారిని ఆదుకునేందుకు పెద్దన్నగా ముందుకొచ్చిన చిరంజీవికి కృతజ్ఞతలు… అన్నారు.
అన్నయ్యతో పాటు రూ. 4 కోట్లు విరాళంగా ఇచ్చిన బాహుబలి ప్రభాస్, రూ. 1 కోటీ 25 లక్షలు విరాళంగా ఇచ్చిన అల్లు అర్జున్, కోటి రూపాయల విరాళం ఇచ్చిన మహేష్ బాబు, రూ. 75 లక్షలు ఇచ్చిన రామ్ చరణ్, రూ. 70 లక్షలు ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్, రూ. 20 లక్షలు ఇచ్చిన నితిన్, త్రివిక్రమ్, దిల్ రాజు, రూ. 10 లక్షలు చొప్పున విరాళంగా ఇచ్చిన సాయి ధర్మ తేజ్, కొరటాల శివ, అనిల్ రావిపూడిలకు .. పవన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. ఈ నేపథ్యంలో తన వంతుగా పవన్ రూ.2 కోట్లు కేంద్రంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలకు అందజేశారు.