హుజూరాబాద్ రాజకీయాలు ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారాయి. అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎలాగైనా ఈటెల రాజేందర్ (Etela Rajender) కు ఒంటరి చేయాలని టీఆర్ఎస్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇంకోవైపు తన బలగాన్ని పెంచుకునేందుకు ఈటల రాజేందర్ హుజూరాబాద్ లోనే మకాం వేసి వర్గీయులను చేజారిపోకుండా చూసుకుంటున్నారు.
అంతేకాదు వరుసగా టీఆర్ఎస్ కు జై కొడుతున్న నేతలతో మంతనాలు జరిపి మళ్లీ తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో చాలామంది ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. హరీష్‌రావు లాంటి ట్రబుల్ షూటర్ రంగంలోకి దిగినా టీఆర్ఎస్కు వరుస షాక్‌లు తగులుతున్నాయి.
ఇప్పటికే చాలామంది టీఆర్ఎస్కు షాక్ ఇచ్చారు. ఇక నిన్న కూడా కమలాపూర్ ఎంపీపీ, మండల అధ్యక్షుడు సైతం కారుకు గుడ్‌బై చెప్పి ఈటెల రాజేందర్ కు జైకొట్టారు. అదే దారిలో నేడు మరికొందరు ఈటలకు మద్దతు తెలిపారు. వీణవంక మండలానికి చెందిన పలువురు ముఖ్య నేతలు ఈ రోజు ఈటలకు మద్దతు తెలిపుతూ తీర్మానం చేశారు. ఈ మండంలోని దాదాపు 7 గ్రామాల సర్పంచ్‌లు, వీరితో పాటు వైస్ ఎంపీ పీ, మండల పీఏసీఎస్ వైస్ చైర్మన్, డైరెక్టర్లు, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు ఈటలకు మద్దతు తెలుపుతూ టీఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేస్తామని ప్రకటించారు. దీంతో టీఆర్ ఎస్ నేతలు చేస్తున్న ప్రయత్నాలు బెడిసి కొడుతున్నాయి.