రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించిన ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. ఈ ఘటనలో ఆదివారం ఇద్దరు మరణించగా.. ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఇవాళ ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలోని సీతారాంపేట్‌కు చెందిన లావణ్య, కొలకులపల్లికి చెందిన మౌనిక అనే మరో ఇద్దరు కన్నుమూశారు.
ఇబ్రహీంపట్నం ప్రభుత్వ సివిల్ ఆసుపత్రిలో ఈ నెల 25న 34 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. వీరిలో నలుగురు మహిళలు అస్వస్థతకు గురి కాగా.. వారిలో ఇద్దరు ఆదివారం ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితి విషమించిన లావణ్య, మౌనికలను ప్రైవేటు ఆసుపత్రులకు తరలించగా.. చికిత్స పొందుతూ ఈరోజు చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 4కు చేరింది.
మహిళల మృతిపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతామని కుటుంబ సంక్షేమ శాఖ ఉపసంచాలకులు రవీందర్ నాయక్ ఆదివారం వెల్లడించారు. ఘటన గురించి తెలుసుకున్న ఆయన… ఇబ్రహీంపట్నం ఆస్పత్రికి వచ్చి… పరిస్థితిపై ఆరా తీశారు. అనుభవజ్ఞులైన వైద్యులే కుటుంబనియంత్రణ ఆపరేషన్లు చేస్తారని… విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక అందించనున్నట్లు తెలిపారు.