టాలీవుడ్​లో విషాదం.. ప్రముఖ హాస్యనటుడు కన్నుమూత

-

చిత్రపరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ హాస్యనటుడు కడలి జయసారథి(83) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతన్న ఆయన.. చికిత్స పొందుతూ సిటీ న్యూరో ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితోనూ బాధపడుతున్నారు. ఆయన మృతి పట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. కాగా, మధ్యాహ్నాం 2 గంటలకు మహాప్రస్థానంలో జయసారథి అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన సుమారు 372 చిత్రాల్లో నటించారు.

1961లో సీనియర్​ ఎన్టీఆర్​ దర్శకత్వం వహించిన ‘సీతారామ కళ్యాణం’ చిత్రంతో వెండితెర అరంగేట్రం చేశారు సారథి. ఆ చిత్రంలో నలకూబరునిగా నటించారు. అనేక సినిమాలలో హాస్యపాత్రలు పోషించి ప్రేక్షకుల మెప్పు పొందారు. వీరు దాదాపు 372 తెలుగు సినిమాలలో నటించారు. తెలుగు చిత్రపరిశ్రమను మద్రాసు నుండి హైదరాబాద్​కు తరలించడంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) వ్యవస్థాపక సభ్యుడిగానూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ సినీకార్మికుల సంస్థకు వ్యవస్థాపక కోశాధికారిగా ఉన్నారు. నాటకరంగానికి సేవచేశారు. ఋష్యేంద్రమణి, స్థానం నరసింహారావు, రేలంగి వెంకట్రామయ్య, బి.పద్మనాభం వంటి గొప్ప నటులతో కలిసి నాటకాలలో నటించారు.

సీతారామ కళ్యాణం (1961) – నలకూబరుడు, పరమానందయ్య శిష్యుల కథ (1966) – శిష్యుడు, ఈ కాలపు పిల్లలు (1976), భక్త కన్నప్ప (1976), అత్తవారిల్లు (1977), అమరదీపం (1977, ఇంద్రధనుస్సు (1978), చిరంజీవి రాంబాబు, జగన్మోహిని (1978), మన ఊరి పాండవులు (1978), సొమ్మొకడిది సోకొకడిది (1978), కోతల రాయుడు (1979), గంధర్వ కన్య (1979), దశ తిరిగింది (1979), అమ్మాయికి మొగుడు మామకు యముడు (1980), నాయకుడు – వినాయకుడు (1980), మదన మంజరి (1980), మామా అల్లుళ్ళ సవాల్ (1980), బాబులుగాడి దెబ్బ (1984), మెరుపు దాడి (1984) – అంజి, ఆస్తులు అంతస్తులు, శారద, అమరదీపం, ముత్యాల ముగ్గు, కృష్ణవేణి, శాంతి చిత్రాలతో పాటు ఇంకా మరెన్నో చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు

అంతే కాదు సారధి  విజయవంతమైన చిత్రాల నిర్మాత కూడా. ధర్మాత్ముడు,అగ్గిరాజు,శ్రీరామచంద్రుడు చిత్రాలను నిర్మించారు. నవతా కృష్ణంరాజు గారు నిర్మించిన జమిందార్ గారి అమ్మాయి, పంతులమ్మ,అమెరికా అమ్మాయి, ఇంటింటి రామాయణం, ఓఇంటి భాగోతం చిత్రాల మ్యూజిక్ సిట్టింగ్స్ అన్ని సారధి చూసేవారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు గారితో ఉన్న సాన్నిహిత్యంతో గోపికృష్ణ బ్యానర్​లో నిర్మించిన చిత్రాలకు సాంకేతికంగా చూసుకునేవారు. చిత్రపురి కాలనీ నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషించారు.

Read more RELATED
Recommended to you

Latest news