ఏపీలో రాజధానిపై రగడ జరుగుతున్న విషయం తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా అందుకోసం ఓ బిల్లును కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టడం.. కొన్ని రోజుల తరువాత ఉపసంహరించుకోవడం చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలన్న డిమాండ్‌తో రాజధాని రైతులు చేపట్టిన మహా పాదయాత్రకు వరుసగా రెండో రోజైన బుధవారం కూడా వైసీపీ శ్రేణుల నుంచి ఆటంకం ఎదురైంది.
మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పరిధిలోని ఐతంపూడిలో అమరావతి రైతుల యాత్రను నిరసిస్తూ వైసీపీ శ్రేణులు ప్లకార్డులు, నల్ల జెండాలతో ప్రదర్శనకు దిగిన సంగతి తెలిసిందే. తాజాగా బుధవారం తణుకు పట్టణంలోని నరేంద్ర కూడలిలో మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ శ్రేణులు ఏకంగా సభను ఏర్పాటు చేశాయి. సరిగ్గా నరేంద్ర కూడలికి అమరావతి రైతుల యాత్ర చేరే సమయానికి ఈ సభను ఏర్పాటు చేశారు. ఓ వైపు మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ సభ, మరోవైపు అమరావతి రైతుల పాదయాత్రతో తణుకు పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
మంగళవారం మాదిరిగానే రోడ్డుకు ఓ వైపుగా నిలుచున్న వైసీపీ శ్రేణులు…అమరావతి రైతుల యాత్రకు నిరసనగా ప్లకార్డులు, నల్ల బెలూన్లు చేతబట్టి నినాదాలు చేశారు. వారికి ప్రతిగా జై అమరావతి అంటూ రాజదాని రైతులు నినదించారు. ఫలితంగా పట్టణం ఇరు వర్గాల నినాదాలతో మారుమోగింది. ఇరు వర్గాలను అదుపు చేసేందుకు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. చివరకు ఎలాంటి ఘర్షణ లేకుండానే యాత్ర నరేంద్ర కూడలిని దాటి వెళ్లిపోయింది.