ఏపీలోని ఏడు జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద రూ. 25 వేల కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఆర్ధిక మంత్రి బుగ్గన. విభజన సమస్యలపై సదరన్ రిజీనల్ కౌన్సిల్ సమావేశంలో ప్రత్యేక ప్రస్తావన చేసిన ఆర్ధిక మంత్రి బుగ్గన….ఏపీ విభజన అశాస్త్రీయంగా, అన్యాయంగా జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన సమస్యలు ఇప్పటికీ ఏపీని వెన్నాడుతూనే ఉన్నాయని.. విభజన సమస్యల పరిష్కారం.. విభజన హామీల అమలు జరగాలని ఏపీ ప్రజలు కోరుతున్నారని తెలిపారు.
విభజన జరిగి చాలా కాలం అవుతోన్నా.. ఇప్పటికీ ఆ సమస్యలు పెండింగులోనే ఉన్నాయి… తిరుపతిలో జరిగిన సదరన్ కౌన్సిల్ మీటింగులో ఏపీకి సంబంధించి ఏడు కీలకాంశాలను సీఎం జగన్ ప్రస్తావించారని తెలిపారు. విభజన సమస్యల పరిష్కారం కోసం కేంద్రం హైలెవల్ కమిటీ వేయడం సంతోషమని.. ఇందుకు ప్రధాని, హోం మంత్రికి ధన్యావాదాలు చెప్పారు.
త్వరి తగతిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం మరింతగా సహకరించాలని.. ఏపీలో వెనుకబడిన ఏడు జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద రూ. 25 వేల కోట్లు ఇవ్వాలన్నారు. 2014లో రూ. 24350 కోట్ల మేర నిధులను వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాలన్న ప్లానింగ్ కమిషన్ ప్రతిపాదనలు ఇంకా పెండింగులో ఉందని.. వెనుకబడిన జిల్లాలకిచ్చే ప్యాకేజీలో భాగంగా రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్టుకు.. ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి నిధులు కేటాయించాలని కోరారు. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు.. ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చే పన్ను రాయితీలను ఏపీకి ఇవ్వాలి… ఆదాయం సమకూర్చే హైదరాబాద్ లాంటి నగరాన్ని కోల్పోవడం వల్ల జరిగే నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు పన్ను రాయితీలు ఉపకరిస్తాయని వెల్లడించారు.