హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగాయి. ఇంజిన్ లోంచి పొగలు వచ్చి బస్సు కాలిపోయింది. బస్సులో కొంతమంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. సాయంత్రం 6 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ బస్సు సుచిత్ర నుండి కూకట్ పల్లి వైపు వెళ్తోంది. ఐడీపీఎల్ సమీపంలోకి రాగానే ఇంజిన్ నుండి పొగలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బస్సును నిలిపివేసి, కిందకు దిగాడు. క్షణాల్లో మంటలు వ్యాపించి బస్సు పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను ఆర్పేశారు.
బస్సు నిలిపిన సమీపంలో పెట్రోల్ బంకు ఉండటంతో అందరూ ఆందోళన చెందారు. రోడ్డుపై బస్సు దగ్ధం కావడంతో కాసేపు ఆ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రెండు మూడు గంటల పాటు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్ తో పాటు ఇద్దరు ప్రయాణికులు మాత్రమే ఉన్నారు. వీరంతా సురక్షితంగా బయటపడ్డారు.