విశాఖ స్టీల్ ప్లాంట్ లో నేడు భారీ పేలుడు సంభవించింది. లిక్విడ్ స్టీల్ విస్ఫోటనం చెందిన ఈ ఘటనలో 11 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్ఎమ్ఎస్-2 లిక్విడ్ విభాగంలో ఫ్లాగ్ యాష్ ను తొలగించే క్రమంలో, నీళ్లు పడడంతో ఒక్కసారిగా పేలుడు జరిగింది. గాయపడిన వారిలో నలుగురు రెగ్యులర్ కార్మికులు కాగా, ఐదుగురు కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. ఫ్లాగ్ యాష్ ను, తొలగించే క్రమంలో, నీళ్లు పడడంతో తొమ్మిదిమంది ద్రవంలో పడిపోయారు. గాయపడినవారిలో 9 మందికి ప్రథమ చికిత్స అనంతరం విశాఖ సెవెన్ హిల్స్ ఆసుపత్రి కి తరలించారు. కాగా తీవ్రంగా గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడినవారిలో ఓ ఉన్నతస్థాయి ఉద్యోగి ఉన్నట్లుగా తెలుస్తోంది.
కాగా..ఇటీవల కాలంలో విశాఖ స్టీల్ ప్లాంట్ లో పలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నారు. ద్రవరూపంలో ఉండే ఉక్కును నిల్వ చేసే క్రమంలో సరైన సేఫ్టీ పద్దతులు పాటించకపోవడం వల్లనే ఎక్కువగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. కానీ సేఫ్టీ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నా ప్రమాదాలు జరుగుతున్నాయని స్టీల్ ప్లాంట్ యజమాన్యం చెబుతోంది.