పెట్రోల్ ధరలు భగ్గమంటున్న ఈ సమయంలో..ఎలక్ట్రిక్ వాహనాల మీద అందరి దృష్టి పడుతుంది. పలు దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు కొత్త ఎలక్ట్రిక్ వాహనాలతో ముందుకువస్తున్నాయి. దేశీయ స్టార్టప్స్ కూడా తీవ్రమైన పోటీనిస్తున్నాయి. ఆయా స్టార్టప్స్ ముఖ్యంగా రేంజ్‌పై, ఛార్జింగ్ సమయంపై ఫోకస్ పెట్టాయి. పెట్రోల్ నడిచే బైక్ లు అయితే..ఎంత పెట్రోల్ కి ఎంత మైలేజ్ ఇస్తుందనేది పాయింట్..అలాగే ఎలక్ట్రిక్ బైక్ లకు ఎన్ని గంటలు ఛార్జ్ చేస్తే ఎన్ని కిలోమీటర్లు వెళ్తుందనేది ఇక్కడ పాయింట్. కస్టమర్ల డిమాండ్ కు తగ్గట్టుగా మార్కెట్ లోకి కొత్త మోడల్స్ వస్తున్నాయి. ఇప్పటివరకు భారత్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్లే ఎక్కువగా వాహనదారులకు అందుబాటులో ఉన్నాయి. స్కూటర్లే కాకుండా ఇతర బైక్ మోడల్స్‌పై కూడా పలు కంపెనీలు ఇప్పుడు దృష్టిసారిస్తున్నాయి. భారత్‌లో తొలి ఎలక్ట్రిక్ క్రూజర్ బైక్‌ను కొమాకి త్వరలో విడుదల చేయబోతోంది.
ఫుల్ చార్జ్ తో 250 కిమీ వెళ్లొచ్చు..
ఈ క్రూయిజర్‌కు కొమాకి రేంజర్ అని పేరు పెట్టనున్నారట. దీనికి ఒక్కసారి ఫుల్ గా ఛార్జ్ చేస్తే 250 కిమీల వరకు దూసుకెళ్తుంది.ఇది భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ క్రూయిజర్ బైక్. వచ్చే ఏడాది జనవరిలో కంపెనీ కొమాకి రేంజర్‌ను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక ఆ కంపెనీ వెబ్‌సైట్‌లో బైక్ ఫోటోలను కూడా ఉంచారు. మంచి స్టైలిష్ లుక్ తో బైక్ అయితే యువతను ఆకట్టుకునేలానే ఉంది.
అదిరిపోయే ఫీచర్స్
కొమాకి రేంజర్ క్రూజర్ బైక్‌లో ముఖ్యమైన ఫీచర్లుగా క్రూయిజ్ కంట్రోల్, రిపేర్ స్విచ్, రివర్స్ స్విచ్, బ్లూటూత్ సిస్టమ్ , అధునాతన బ్రేకింగ్ సిస్టమ్ ఉండబోతున్నాయి. కొమాకి రేంజర్‌లో 4-కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌తో రానుంది. దీంతో 250 కిమీల మేర రేంజ్‌ను అందిస్తోందని కంపెనీ చెప్తుతోంది. 5000-వాట్ల మోటారుతో పనిచేయనుందట.
ధర ఎంతుంటుందంటే..!
ఎలక్ట్రిక్ వాహనాలు ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. మొన్నటికిమొన్న టెస్లా మోడల్ 3 ఎల్టక్ట్రిక్ కారు ధర కంపెనీ అన్నీ టాక్స్ లతో కలిపి 60లక్షల వరకూ అంచనా వేసింది. అయితే కొమాకి రేంజర్ ధర ఇంకా కంపెనీ బయటపెట్టలేదు.. ఇది సామాన్య ప్రజలకు అందుబాటులోనే ఉంటుందని తెలుస్తుంది. బైక్ ధర లక్ష వరకు ఉంటుందని సమాచారం. ఈ బైక్ అనుకున్నట్లు జనవరిలో రిలీజ్ అయితే..భారత్ లో తొలి ఎలక్ట్రిక్ బైక్ గా కొమాకి రేంజర్ నిలిచిపోతుంది.