ఓ వైపు కరోనా మహమ్మారితోనే సతమతమవుతున్న ప్రజలపై మంకీ పాక్స్ రూపంలో మరో వైరస్ విరుచుకుపడుతోంది. అయితే.. ఇప్పటివరకు మంకీపాక్స్ వైరస్ మరణాలు చోటు చేసుకోలేదు. అయితే.. స్పెయిన్‌లో మంకీపాక్స్ కలకలం సృష్టిస్తున్నది. ఆఫ్రికాలో ఈ వైరస్ వెలుగుచూసినప్పటికీ ప్రపంచంలో అత్యధిక కేసులు స్పెయిన్‌లోనే నమోదయ్యాయి. తాజాగా ఆ దేశంలో తొలి మంకీపాక్స్ సంబంధిత మరణం నమోదయింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ ప్రకటింది. దీంతో ఆఫ్రికా బయట, ఐరోపాలో నమోదైన మంకీపాక్స్ మరణం ఇదే మొదటిది కావడం విశేషం.స్పెయిన్‌లో ఇప్పటివరకు 4298 మందికి మంకీపాక్స్ వైరస్ వ్యాప్తి చెందింది.
ఇందులో 120 మంది దవాఖానలో చికిత్స పొందుతున్నారు. మరొకరు మరణించారని తెలిపారు అధికారులు. అతనికి బ్రెజిల్‌లో ఈ వైరస్ సోకినట్లు నిర్ధారించారు అధికారులు. కాగా, ప్రపంచ దేశాలను మంకీపాక్స్ ఆందోళనకు గురిచేస్తున్న నేపథ్యంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్‌వో) గత శనివారం గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. ఇప్పటివరకు 78 దేశాల్లో 18 వేలకుపైగా మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయని వెల్లడించింది. ఇందులో 70 శాతం కేసులు ఐరోపాలోనే ఉన్నాయని, మరో 25 శాతం అమెరికాలో నమోదయ్యాయని తెలిపింది.