Flash : బండి సంజయ్ అరెస్ట్..పేపర్ లీక్ కేసులో మరో సంచలనం?

-

ఎంపీ, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ని అర్థరాత్రి పోలీసులు కరీంనగర్‌లో అరెస్టు చేశారు. పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో ఆయన్ని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.గత రెండు రోజులుగా ఈ కేసు అనేక మలుపులు తిరుగుతున్న సంగతి తెలిసిందే..అరెస్టును అడ్డుకునేందుకు బీజేపీ కార్యకర్తలు.. ఎంపీ ఇంటి ముందు భారీగా మోహరించారు. అదే సమయంలో పోలీసులు కూడా 50 మందికి పైగానే మోహరించారు. కరీంనగర్‌ అడిషనల్ DCP చంద్రమోహన్‌, ACPలు శ్రీనివాసరావు, కరుణాకర్‌రావు, CIలు లక్ష్మీబాబు, దామోదర్‌రెడ్డి, నటేష్ తదితరులు ఉన్నారు.

ఈ క్రమంలో రెండువైపులా తోపులాటలు జరిగాయి. ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులకు వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేశారు. అయినప్పటికీ ఇవన్నీ ముందే ఊహించిన పోలీసులు.. పక్కా ప్లాన్ ప్రకారం తమ పనిచేసుకుపోయారు. బండి సంజయ్‌ని అరెస్టు చేసి.. హైదరాబాద్ తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.. బుధవారం బండి సంజయ్‌ అత్త మరణించి తొమ్మిది రోజులు అవుతుండటంతో ఆయన కరీంనగర్‌ వచ్చారు. ఇంటి కార్యక్రమాల్లో ఉండగా.. పోలీసులు అరెస్ట్ చేశారు..

బండి సంజయ్ అరెస్టును బీజేపీ ఖండించింది. ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందనీ.. కేసీఆర్ సర్కార్ కూలిపోయే రోజులు దగ్గర పడ్డాయని బీజేపీ నేతలు మండిపడ్డారు. ఇకపోతే ప్రశ్నాపత్రాల లీకేజీకీ, బండి సంజయ్‌కీ ఏంటి సంబంధం అనేది తేలాల్సి ఉంది. ఈ కేసులో ఆయన కీలక పాత్ర పోషించారా? ఆయనే లీకేజీలు చేయించారా? లేదా కావాలని ఈ కేసులో ఇరికిస్తున్నారా? అసలు ఏ కేసులో ఆయన్ని అరెస్టు చేశారు? అనే అంశాలపై పోలీసులు క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఏది ఏమైనా అర్థరాత్రి సమయంలో బండి సంజయ్‌ని ఇంటికి వచ్చి మరీ బలవంతంగా అరెస్టుచెయ్యడం బీజేపీ వర్గాలను షాక్ కు గురిచేసింది.. ఈరోజు ఈ ఘటనను వ్యతిరేకిస్తూ నిరసనలు చేయనున్నట్లు సమాచారం.. ఈ ఘటన పై మరింత సమాచారం తెలియాల్సి ఉంది..

Read more RELATED
Recommended to you

Latest news