ప్రపంచంలోని మనుషులందరూ ఒకేలా ఉండరు. కొందరి మానసిక స్థితి సరిగ్గానే ఉంటుంది. అయితే కొందరి స్థితి వేరేగా ఉంటుంది. దీంతో వారు చిత్రాతి చిత్రమైన పనులు చేస్తుంటారు. సమస్యల్లో ఇరుక్కుంటుంటారు. అమెరికాలోని ఫ్లోరిడాలోనూ సరిగ్గా ఇలాగే జరిగింది. ఓ వ్యక్తి గోల్ఫ్ కోర్స్ నుంచి చిన్న మొసలిని దొంగిలించాడు. తరువాత ఇబ్బందుల్లో ఇరుక్కున్నాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..?
ఫ్లోరిడాకు చెందిన 32 ఏళ్ల ఓ వ్యక్తి అక్కడి ఓ మినియేచర్ గోల్ఫ్ కోర్స్‌లోని సరస్సులో ఉన్న మొసలిని దొంగిలించాడు. దాన్ని అక్కడికి సమీపంలోని హైవే ఎ1ఎ అనే ప్రాంతంలో ఉన్న కాక్‌టెయిల్ లాంజ్‌లోని పైకప్పు మీదకు విసరాలనుకున్నాడు. ఈ క్రమంలోనే దాని తోకను పట్టుకుని అటు ఇటు బండకు బాదినట్టు బాదాడు. ఆ దృశ్యాలను పోలీసులు గమనించి అతన్ని అరెస్టు చేశారు.
అయితే ఇలా ఎందుకు చేశావని అడిగితే ఆ మొసలికి గుణపాఠం చెప్పాలని చూశానని, అందుకనే దాన్ని దొంగిలించానని చెప్పాడు. దీంతో పోలీసులు అతని మాటలను విని నివ్వెరపోయారు. అయితే ఇలాంటి చిత్రమైన సంఘటనలకు ఫ్లోరిడా ఇటీవల వేదిక అవుతోంది.
ఇటీవలే ఓ వ్యక్తి అక్కడి స్టార్ బక్స్ డ్రైవ్ త్రూ వద్దకు వెళ్లి తనకు క్రీమ్ చీజ్ వేయలేదని అందులో ఉన్న ఓ మహిళా ఉద్యోగిపై గన్ గురి పెట్టాడు. కానీ అక్కడ ఎలాంటి హింసా చోటు చోసుకోలేదు. ఇక ఓ మహిళ తనకు తన పెరట్లో ఓ చిన్న డైనోసార్ కనిపించిందని వ్యాఖ్యలు చేసింది. సాక్ష్యంగా ఓ వీడియోను కూడా చూపించింది. కానీ అందులో ఓ పెద్ద పక్షి ఉండడం విశేషం. ఇలా అక్కడి వారు ఎందుకు ప్రవర్తిస్తున్నారో అర్థం కాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.