దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు తమ ప్రచారానికి సిద్ధం అవుతున్నాయి. ఇందులో భాగంగా ఆయా పార్టీలు ప్రణాళికలను రచిస్తున్నాయి.ఈ క్రమంలో కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ అధినేత హెచ్‌డీ కుమారస్వామి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సారి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు మంగళవారం అధికారికంగా అనౌన్స్ చేశారు.
కర్ణాటకలోని మాండ్య లోక్ సభ స్థానం నుంచి తాను పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. బీజేపీతో పొత్తులో భాగంగా తమ పార్టీ మాండ్య, కోలార్, హాసన్ స్థానాల నుంచి పోటీ చేస్తుందని వెల్లడించారు. మొత్తం 28 ఎంపీ స్థానాలు ఉన్న కర్ణాటకలో 2 దశల్లో లోక్ సభ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఏప్రిల్ 26, మే 7వ తేదీల్లో పోలింగ్ జరుగనుంది. కర్ణాటక పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ, జేడీఎస్‌లు పొత్తు పెట్టుకున్నాయి. పొత్తులో భాగంగా జేడీఎస్‌కి పోటీ చేసేందుకు మూడు లోక్ సభ నియోజకవర్గాలు కేటాయించారు.