మాజీ ఎంపీ పొంగులేటి ప్యూహం ఫలిస్తుందా ?

-

ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్‌ఎస్‌లో వర్గ విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కొంతకాలంగా జిల్లా గ్రూప్ రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి. అవకాశం వచ్చినప్పుడల్లా ఒక నేత మరోక నేతపై పైచేయి సాధించే పనిలో ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి గళం విప్పారు. మాటల తుటాలు పేల్చి ప్రత్యర్ది వర్గానికి గట్టి సిగ్నల్సే పంపారు..తన వర్గాన్ని కాపాడుకునే పనిలో ఉన్న మాజీ ఎంపీ కొత్త ప్యూహానికి తెర లేపారా అన్న దానిపై ఖమ్మం జిల్లాలో ఆసక్తికర చర్చ నడుస్తుంది.


తన వర్గం నేతలను ఇబ్బందులు పెడుతుండడంతో మొదటిసారిగా ప్రత్యర్థులపై ఫైర్ అయ్యారు పొంగులేటి. ఇకపై చూస్తూ ఊరుకుంటే.. తమ వెంట నడుస్తున్న కార్యకర్తలు ఆత్మస్థైరం కోల్పోతారన్న ఆలోచనకు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వచ్చినట్టు స్పష్టమవుతోంది. జిల్లాలో తిరగాలంటే పాస్‌పోర్ట్ కావాలా అని తన ప్రత్యర్ధులను ప్రశ్నించడం ద్వారా ఒక రకంగా పార్టీలోనే ప్రత్యర్ధుల పై ఎదురుదాడి మొదలెట్టారు. కొంత మంది ప్రజా ప్రతినిధులు,కార్యకర్తలు పొంగులేటి కి తాము పడుతున్న ఇబ్బందుల పై ఫిర్యాదు చేయగా ఒకింత ఘాటుగానే స్పందించారు.

టీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్యేలదే నియెజకవర్గాలలో తుది నిర్ణయం అని పార్టీ అంతర్గత సమావేశాల్లో పలుమార్లు కేసిఆర్ నేతలకు స్పష్టం చేశారు. తాజాగా ఖమ్మం జిల్లాలో కూడా ఇటువంటి పరిస్థితులు ఉండడంతో రాజకీయ విభేదాలు బయటపడ్డాయి. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అనుచరులను ఆయా నియెజకవర్గాలలోని ఎమ్మెల్యేలు ఇబ్బంది పెడుతున్నారట. సత్తుపల్లిలోనూ అటువంటి పరిస్థితి ఉండడంతో అక్కడికి పర్యటనకు వెళ్లిన ఆయన.. రాజకీయాలలో ఏదీ శాశ్వతం కాదన్నారు. కక్షపూరిత రాజకీయాలు వద్దని పరోక్షంగా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు స్పష్టం చేశారు.

పదవి రావాలి అన్నప్పుడు పదవిని భగవంతుడు ఇవ్వాలి అన్నప్పుడు ఎవరు అడ్డుపడ్డ ఆ పదవి ఆగదు అని అదేవిధంగా పదవి పోయే టైం వచ్చినప్పుడు ఎవరు అడ్డుపడ్డ ఆగదు అని పదవులు ఎవడబ్బ సొత్తు కాదు అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు పొంగులేటి. కష్టపెట్టిన వారు వడ్డీతో సహ అనుభవించాల్సి ఉంటుందని ఒక అడుగు ముందుకు వేసి హెచ్చరించారు. ప్రత్యర్ధులను గట్టిగా హెచ్చరించడం ద్వారా ఇకపై ఊరుకోబోనన్న సంకేతాలు పంపారేమోనని కొందరు భావిస్తున్నారు. తన మనసులో మాట బయటపెట్టారని అభిప్రాయపడేవారు కూడా ఉన్నారు.

ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేళ పొంగులేటి కామెంట్స్ టీఆర్ఎస్ లో కొత్త చర్చకి దారితీశాయి. పొంగులేటి కామెంట్స్ తో టీఆర్ఎస్ అధిష్టానం కూడా అలర్టయింది. ఎమ్మెల్యే సండ్ర ,పొంగులేటిని పిలిచి కేటీఆర్ మాట్లాడినట్లు తెలుస్తుంది. మొత్తానికి మాజీ ఎంపీ కామెంట్స్ ప్యూహం అధిష్టానం వద్ద బాగానే వర్కవుటైందన్న చర్చ నడుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news