కోల్కతాలోని కస్బాలో ఏర్పాటు చేసిన దుర్గా మండపం వివాదాస్పదమైంది. దసరా నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో అఖిల భారతీయ హిందూ మహాసభ దుర్గాదేవి మండపాన్ని ఏర్పాటు చేసింది. దుర్గా మాత పాదాల కింద.. దుర్గమ్మ వధించిన అసురుడి ముఖం గుండ్రటి కళ్లద్దాలతో బాపూను తలపించింది. ఈ విషయంపై దుమారం రేగింది.
దీనిపై అఖిల భారతీయ హిందూ మహాసభ స్పందించింది. “గాంధీ.. జాతిపిత అని మేము విశ్వసించడం లేదు. దుర్గమ్మ విగ్రహంలో అసురుడి రూపం గాంధీని తలపించడం యాదృచ్ఛికం మాత్రమే. అవసరమైన అనుమతులు అన్నీ తీసుకున్నా.. మా పూజా మండపం మూసేయాలని అధికార యంత్రాంగం ఒత్తిడి చేస్తోంది.” అని హిందూ మహాసభ బంగాల్ అధ్యక్షుడు మొహంతో సుందర్ గిరి మహారాజ్ తెలిపారు.
ఈ వ్యవహారం వివాదాస్పదమైన నేపథ్యంలో నిర్వాహకులు విగ్రహాన్ని మార్చారు. పోలీసుల ఒత్తిడి మేరకే ఇలా చేయాల్సి వచ్చిందని చెప్పారు. పూజా మండపం మూసేయాలని అధికారులు ఒత్తిడి తెచ్చారన్న ఆరోపణల్ని కోల్కతాకు చెందిన సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తోసిపుచ్చారు. తాము ఎవరికీ అలాంటి సూచనలు చేయలేదని స్పష్టం చేశారు.