హైదరాబాద్ వ్యాప్తంగా గణపతి నిమజ్జన వేడుకులు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుంచే గణపయ్యను గంగమ్మ ఒడికి చేర్చడానికి మండపాల నుంచి తీసుకువెళ్తున్నారు. దారి పొడవునా బ్యాండ్ బాజాలతో, నృత్యాలతో కోలాహలం చేస్తూ వినాయకుడిని గంగమ్మ ఒడికి చేరుస్తున్నారు. నగరంలో జరుగుతున్న వినాయక నిమజ్జనంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు.
హైదరాబాద్ హిమాయత్‌నగర్ గణేశ్ నిమజ్జన వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. వినాయకుడిని నిమజ్జనం కోసం ట్యాంక్ బండ్ వైపు తరలిస్తుండగా.. ఓ విగ్రహం కూలిపోయింది. హిమాయత్‌నగర్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ వద్ద ఉన్నట్టుండి ఒక్కసారిగా గణేశుడి విగ్రహం పడిపోయింది. కర్మన్‌ఘాట్‌లోని టీకేఆర్ కళాశాల ఎదుట ఈ 20 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నవజీవన్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వర్షానికి తడవడం వల్లే కూలిపోయిందని అసోసియేషన్ సభ్యులు అంటున్నారు. నడిరోడ్డు మీద విగ్రహం కూలడం వల్ల హిమాయత్‌నగర్‌లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.