ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రోడ్ల మరమ్మత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసిందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ లో మిగిలిపోయిన రోడ్ల నిర్మాణం కోసం జీవో నెంబర్ 406, 407 ద్వారా రూ.75 కోట్లు మంజూరు చేయడం జరిగిందని గంగుల చెప్పారు. వాటిలో రూ.59 కోట్ల 30 లక్షలతో కొత్తపల్లి, రూరల్ మండలాల్లో ఆరు కొత్త రోడ్లు వేస్తామని, వరదల కారణంగా దెబ్బతిన్న10 రోడ్లను బాగు చేస్తామని గంగుల పేర్కొన్నారు. నియోజకవర్గంలో మట్టి రోడ్డు అనేది కనిపించకుండా చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
నియోజకవర్గంలో ఇప్పటివరకు ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్ రోడ్లు 85 శాతం పూర్తయ్యాయని గంగుల కమలాకర్ చెప్పారు. రూరల్, పట్టణ రోడ్లను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. వచ్చే ఏడాది మార్చి లోపే అన్ని పనులు పూర్తి చేస్తామని మంత్రి గంగుల తెలిపారు. రూ.14 కోట్ల 78 లక్షలతో 8 ఆర్ అండ్ బి రోడ్లను రెన్యూవల్ పనులను డిసెంబర్ లో ప్రారంభించి మార్చ్ 31లోపు పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కరీంనగర్‌లో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుకు సంబంధించి రూ.40 కోట్ల నిధుల కోసం ప్రతిపాదనలు పంపామని, రేపు దానికి సంబంధించిన జీవో విడుదల అవుతుందని మంత్రి గంగుల తెలిపారు.