విశాఖ రాజకీయాల్లో కీలకంగా ఉండే గంటా శ్రీనివాసరావు నిన్నటి వేళ హైద్రాబాద్ లో ప్రత్యక్షమయ్యారు. తమ పార్టీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఓ వివాహ వేడుకలకు హాజరైన ఆయన అదే సందర్భంలో అధినేత కూడా అక్కడికి రావడం, ఆయన్ను కలవడం, ఆయనతో నవ్వులు పంచుకోవడం అన్నవి చకచకా జరిగిపోయాయి. ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ శిష్యుడు అవంతి శ్రీను పరిస్థితి వైసీపీలో బాలేదు. మంత్రి పదవి కూడా లేదు. విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్ష పదవితో సాధించేదేమీ లేదు. కనుక ఆయన అక్కడ ఉంటారో ఉండరో అన్న డౌట్ ఓవైపు ఉంటుండగానే అసలు గంటా శ్రీను పార్టీలో కొనసాగుతారో లేదో అన్న సంశయాలు మరోవైపు వస్తున్నాయి. ఆయన గత కొద్ది రోజులుగా జనసేన సభ్యులతో టచ్ లో ఉంటున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. అవి నిరాధార ఆరోపణలా కాదా అన్నది గంటా శ్రీను మాత్రమే తేల్చాలి.
వాస్తవానికి విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమంకు మద్దతుగా ఉంటూ గంటా శ్రీను తన పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. ఆ విధంగా విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారన్న వార్తలూ గుప్పుమన్నాయి. ఆ విధంగా చేశారు కానీ స్పీకర్ దానిని అంగీకరించలేదు. మధ్యలో ఓ సారి ఆయన శ్రీకాకుళం వచ్చి స్పీకర్ సీతారాం ను కలిసి కూడా వెళ్లారు. అయితే ఆయన రాజీనామా స్పీకర్ ఫార్మెట్ కు చెంది ఉందా లేదా అన్నది కూడా ఇంతవరకూ స్పీకర్ ఆఫీసు వర్గాలు కూడా వెల్లడించలేదు.
దాంతో ఆయన రాజీనామా లేఖ అలానే పెండింగ్ లోనే ఉండిపోయింది. పదవీ త్యాగంతో సానుభూతి వస్తుందని ఆయన భావించినా కూడా అవేవీ చెల్లలేదు. చెల్లుబాటు కాలేదు. ఉద్యమ తీవ్రత పెరుగుతున్న కొద్దీ విశాఖ రాజకీయ ప్రతినిధులపై ఒత్తిడి పెరిగింది కానీ చాలా మంది ఎవరి ఇంట్లో వాళ్లు దాక్కొని ఉన్నారు అన్న విమర్శలతో పరువు పోగొట్టుకున్నారు. ఆ విధంగా గంటా శ్రీను రాజీనామా విషయం అన్నది ఎటూ కాకుండా పోయింది. ఎందుకూ పనికిరాకుండా పోయింది.
కేవలం పొలిటికల్ మైలేజీ కోసమే ఆయన ఈ విధంగా చేసి ఉంటారు అన్న వాదన ఒకటి కమ్యూనిస్టు పార్టీలు కూడా అభిప్రాయపడ్డాయి. ఆ విధంగా విశాఖ ఉక్కు ఉద్యమంలోకి దూకి పేరు తెచ్చుకోవాలని, ఇదే విషయమై గత కొంత కాలంగా మాట్లాడుతున్న శ్రీకాకుళం యువ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడుతో కలిసి పనిచేయాలనుకుని తరువాత ఆ నిర్ణయాన్ని సైతం విరమించుకున్నారు. ఇప్పుడు ఆయన డైలమాలో ఉన్నారు. టీడీపీలోఉంటారా లేదా వైసీపీకి వెళ్తారా ఏమో గుర్రం ఎగరా వచ్చు.. పార్టీ మారిన ప్రతిసారీ మంత్రి పదవులు పొందిన విధంగానే 2024 ఆయనకు మరో మంచి అవకాశం
ఇవ్వనూ వచ్చు. ఎందుకంటే వైసీపీలో అవంతి శ్రీను ఎపిసోడ్ ముగిసిపోయింది అన్న టాక్ వస్తోంది.
దీంతో అవంతిని అటుంచి గంటాను అధినాయకత్వం ప్రోత్సహించినా ప్రోత్సహించవచ్చు. లేదంటే జనసేనకు పోయినా కాస్తో కూస్తో బెటర్. టీడీపీలో ఉంటూ సాధించేది మాత్రం ఏమీ లేదని ఓ దశలో ఆయనపై కథనాలు వెలుగు చూశాయి. విశాఖ కేంద్రంగా వెలువడే స్థానిక పత్రికలు ఆయన పనితీరు ఏం బాలేదని దుమ్మెత్తిపోశాయి కూడా ! కనీసం నియోజకవర్గ స్థాయిలో ఆయన తిరుగాడకుండా నాయకుడిగా ఎలా ప్రజల మన్ననలు అందుకుంటారని ప్రశ్నించాయి కూడా ! కనుక ఆయన డైలమా వీడి ఏదో ఒక నిర్ణయం స్పష్టమైన రీతిలో తీసుకుంటే రాజకీయ భవిష్యత్ పై ఓ క్లారిటీ రావడం ఖాయం. ఎలానూ ఇంతకాలం ఆయన రాకను అడ్డుకున్న సాయిరెడ్డి ఇప్పుడు విశాఖ బాధ్యతల్లో లేరు. వైవీ సుబ్బారెడ్డి (జగన్ బాబాయ్, టీటీడీ చైర్మన్) సీన్ లోకి వచ్చారు కనుక గంటాకు ఇకపై వైసీపీ నుంచి పిలుపు వచ్చే అవకాశాలనూ కొట్టిపారేయలేం. ఆ విధంగా అవంతి ని సైలెంట్ చేసి గంటాను హైలెట్ చేయడమే వైసీపీ అధినాయకత్వం ముందున్న ఓ ఆలోచన అని కూడా తెలుస్తోంది. ఏమో గుర్రం ఎగరావచ్చు !