ఎన్నో ఏళ్లుగా పోడు భూములను సాగు చేస్తూ అటవీ హక్కు పత్రాలు పొందని గిరిజన, గిరిజనేతరులకు న్యాయం కల్పించడంతో పాటు అడవులు సంరక్షణ, పునర్జీవనానికి శాశ్వత ప్రాతిపదికన పరిష్కారం కొరకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖామంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు.
గురువారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ ఏర్పాటు చేసిన జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో 85 గ్రామాలలో 7,740 ఎకరాలకు సంబంధించి 4,503 క్లెయిమ్ లు స్వీకరించి ఆన్ లైన్ లో పొందుపరిచామని అన్నారు. కాగా 85 గ్రామ పంచాయితీలలోని 140 హాబిటేషన్ లలో 4,606 ఎకరాలకు సంబంధించి 2,776 క్లెయిమ్ లు సకాలంలో వచ్చిన ఆన్ లైన్ గ్రామ వివరాలు కనిపించక పొందుపరచలేకపోయారని అన్నారు.
ఇందుకు సంబంధించి సమగ్ర వివరాలు మండలాల వారీగా ఏం.పి.డి.ఓ.లకు అందించవలసినదిగా అటవీశాఖాధికారికి సూచించారు. రెవిన్యూ, పంచాయత్ రాజ్, అటవీశాఖలు సమన్వయం చేసుకుంటూ ఏం.పి .డి.ఓ.లు గ్రామా స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసుకొని 2005 కంటే ముందు నుండి అన్యాక్రాంతంగా పోడు భూములు సాగు చేస్తున్న గిరిజనులను, మూడు తరాలు అనగా 75 సంవత్సరాలనుండి పోడు భూములను సాగుచేస్తున్న గిరిజనేతరులకు సంబంధించిన క్లెయిమ్ లను గ్రామ స్థాయి కమిటీలో క్లెయిమ్ దారు సమక్షంలో క్షేత్ర స్థాయిలో సర్వే చేపట్టాలని, ఆయా స్థాయి కమిటీలో తీర్మానాలను, రిజిస్టర్లను పక్కాగా నమోదు చేయాలన్నారు.