సాయుధ దళాల్లో నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అయినా కేంద్రం ప్రభుత్వం అవేవి పట్టించుకోకుండా అగ్నివీరుల నియామకాల చర్యలు వేగవంతం చేసింది. అగ్నిపథ్ పథకం కింద నియామక ప్రక్రియను త్వరలోనే విడుదల చేస్తున్నట్లు ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే వెల్లడించారు. తాజాగా వాయు సేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి కూడా స్పందించారు. జూన్ 24వ తేదీ నుంచి ఎయిర్‌ఫోర్స్ లో అగ్నివీరుల నియామక ప్రక్రియను ప్రారంభించనున్నట్లు తెలిపారు.
యువత సాయుధ బలగాల్లో చేరేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని ప్రకటించింది. 17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల వయసున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అయితే గత రెండేళ్లుగా సైనిక నియామకాలు చేపట్టలేదు. దీంతో అగ్నిపథ్ తన తొలి రిక్రూట్‌మెంట్‌కు గరిష్ట వయోపరిమితిని 23 ఏళ్లకు పెంచింది. కాగా, అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నిరసన జ్వాలలు చెలరేగాయి. నాలుగేళ్ల తర్వాత తమకు నిరుద్యోగులుగా మార్చే ఈ పథకం తమకు వద్దని నిరసనకారులు ఆందోళన చేపడుతున్నారు.