గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ ఇంక్‌కు భారి ఎదురుదెబ్బ తగిలింది. ఒక్క స్ట్రోక్‌లో 100 బిలియన్ డాలర్లు తగ్గింది. బుధవారం, ఆల్ఫాబెట్ ఇంక్ షేర్లు 8.59 డాలర్లు పడిపోయి 99.05 డాలర్లకు దిగి వచ్చాయి. ఒక్క పొరపాటు వల్ల 100 బిలియన్ డాలర్లు నష్టం వాటిల్లిందంట.. ఇంతకీ ఆ తప్పు ఏంటి..?
ఒక్క పొరపాటు వల్ల 100 బిలియన్ డాలర్లు నష్టం..
రెండు నెలల క్రితం, 2022 నవంబర్ నెల చివరి వారంలో, గ్లోబల్ టెక్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ (Microsoft) తన కొత్త ప్రొడక్ట్ ఛాట్‌జీపీటీ (ChatGPT) చాట్‌బాట్‌ను పరిచయం చేసింది. టెక్ యుగంలో ఇదొక మైలురాయి. సెర్చ్ ఇంజిన్లలో రారాజుగా వెలుగొందుతున్న గూగుల్‌కు ఇది పోటీగా నిలిచింది. దీంతో, Google మాతృ సంస్థ ఆల్ఫాబెట్, ChatGPTకి పోటీగా chatbot బార్డ్‌ను పరిచయం చేసింది. దీని ప్రమోషన్‌లో భాగంగా, ట్విట్టర్‌లో ఒక చిన్న వీడియోను కూడా పోస్ట్ చేసింది. అందులో, బార్డ్ ఒక తప్పుడు సమాచారం ఇచ్చిందట..
గూగుల్ పరిచయం చేస్తున్న ఈ కొత్త టెక్నాలజీని (బార్డ్) ‘జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ తాజాగా ఏం కనిపెట్టింది, నా తొమ్మిదేళ్ల కుమారుడికి దాని గురించి ఏం చెప్పవచ్చు?’ అని ప్రశ్న అడిగారు. ఈ ప్రాంప్ట్‌కు బార్డ్ చెప్పిన సమాధానం ఏంటంటే.. “మన సౌర వ్యవస్థ వెలుపల ఉన్న ఒక గ్రహానికి సంబంధించిన చిత్రాన్ని మొట్టమొదటిసారిగా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ తీసింది” అని సమాధానం ఇచ్చింది. ఈ సమాధానం దెబ్బకు నెటిజన్ల మైండ్స్ బ్లాంక్ అయ్యాయి.
వాస్తవానికి, మన సౌర వ్యవస్థ వెలుపల ఉన్న ఒక గ్రహానికి సంబంధించిన చిత్రాన్ని మొట్టమొదటిసారిగా తీసింది జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ కాదు. యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీకి చెందిన వెరీ లార్జ్ టెలిస్కోప్ (VLT) 2004లో ఆ చిత్రాన్ని తీసింది, NASA కూడా దీనిని నిర్ధరించింది. దీంతో, బార్డ్ అందించే సమాచారంపై అపనమ్మకాలు ఒక్కసారిగా విజృంభించాయి. ఆ ప్రభావం గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ షేర్ల మీద ఘోరంగా పడింది. బ్లూమ్‌బెర్గ్ (Bloomberg) నివేదిక ప్రకారం.. షేర్ల పతనం తర్వాత ఆల్ఫాబెట్ మార్కెట్ విలువ కేవలం ఒక్క రోజులో (బుధవారం) 100 బిలియన్ డాలర్లు తగ్గింది, ఇప్పుడు 1.278 ట్రిలియన్ డాలర్ల వద్ద ఉంది. అంతకు ముందు, 2022 అక్టోబర్ 26న ఆల్ఫాబెట్ (గూగుల్) షేర్లు 8.9 శాతం పడిపోయాయి.
చాట్‌జిపీటీని మార్కెట్‌లోకి మైక్రోసాఫ్ట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి గూగుల్ ఒత్తిడిలో ఉంది. సాంకేతిక పరిశ్రమలో దీనిని నెక్ట్స్ జెన్ టెక్నాలజీ, నెక్ట్స్ జెన్ సెర్చ్ ఇంజిన్‌గా దీనికి బ్రహ్మరథం పట్టారు. కేవలం రెండు నెలల్లోనే 100 మిలియన్ యూజర్లు యాడ్ అయ్యారు. మైక్రోసాఫ్ట్, చాట్‌జీపీటీపై బిలియన్ల పెట్టుబడి పెడుతోంది. దీంతో, మార్కెట్ పోటీలో నిలబడడానికి గూగుల్ కూడా తీవ్రంగా శ్రమిస్తోంది. ఛాట్‌జీపీటీ కంటే మెరుగైన సెర్చ్ టూల్ అని చెబుతూ బార్డ్‌ను తీసుకొచ్చింది. అది కాస్త ప్రారంభ దశలోనే ఇలా అయింది…బార్డ్‌లో లోపాలను తొలగించి త్వరలోనే లాంచ్ చేస్తామని గూగుల్ చెబుతోంది