ఈరోజుల్లో వాట్సవ్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. మీరు ఈ మధ్య వాట్సప్‌లో ఒక స్టేటస్ గమనించే ఉంటారు.. వాట్సాప్ చాటింగ్‌లను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీ చేసిందనే సమాచారం ఇటీవల విస్తృతంగా ప్రచారం అవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర సమాచారశాఖలోని పీఐబీ విభాగం స్పందించింది. అలాంటి మార్గదర్శకాలేవీ ప్రభుత్వం విడుదల చేయలేదని స్పష్టం చేసింది. అది నకిలీ (Fake) మెసేజ్ అని పేర్కొంది.
‘వాట్సాప్ మెసేజ్‌లను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రజలపై ప్రభుత్వం చర్యలు తీసుకోనుందని సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతోన్న మెసేజ్ నకిలీది. అటువంటి మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేయలేదు’ అని కేంద్ర ప్రభుత్వ ఫ్యాక్ట్‌చెక్ విభాగం స్పష్టం చేసింది. ‘
ఇదే నకిలీ మెసేజ్..
వాట్సాప్‌లో మెసేజ్ పంపిస్తే ఒక టిక్ గుర్తు, అవతలివారికి చేరితే రెండు టిక్‌లు, 2 బ్లూకలర్ టిక్‌లు ఉంటే మెసేజ్ చదివారని.. మూడు బ్లూ టిక్ గుర్తులు ఉంటే ప్రభుత్వం వాటిని గమనించిందని.. రెండు బ్లూ, ఒక రెడ్ టిక్ మార్క్ ఉంటే ప్రభుత్వం మీపై చర్యలు తీసుకోనుందని.. అదే ఒకటి బ్లూ, రెండు రెడ్ టిక్‌లు ఉంటే మీ సమాచారాన్ని ప్రభుత్వం పర్యవేక్షిస్తోందని.. మూడు రెడ్ కలర్‌లో ఉంటే ప్రభుత్వం మీపై చర్యలకు ఉపక్రమించిందని, వీటికి సంబంధించి త్వరలోనే మీకు కోర్టు నుంచి సమన్లు జారీ అవుతాయి’ అని పేర్కొంటూ ఒక మెసేజ్ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయింది.
వాట్సాప్‌లో ఇటువంటి మెసేజ్‌లపై ‘మెటా’ సంస్థ ఇప్పటికే పలుసార్లు స్పష్టత ఇచ్చింది. వాట్సాప్‌లో మెసేజ్‌లు పూర్తి సురక్షితమని (Encrypted).. వారిని ఎవ్వరూ చదవలేరని తెలిపింది. అంతేకాకుండా వాట్సాప్ సంస్థ కూడా వాటిని చదివే ఆస్కారం లేదని తెలిపింది. సో.. మీ వాట్సప్ చాట్‌ను ఎవరూ చదవలేరు అనేది నిజం. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఆ మెసేజ్ నకిలీది. మీ ఆత్మీయుల్లో ఎవరైనా ఆ మెసేజ్ నిజమే అనుకుంటుంటే.. వారికి అసలు విషయం చెప్పండి.