తెలంగాణలో పెండింగ్ బిల్లుల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పలు బిల్లులకు ఆమోదం తెలపకుండా గవర్నర్ తమిళిసై పెండింగ్‌లో పెట్టటంపై తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పెండింగ్ బిల్లులకు వీలైనంత త్వరగా ఆమోదం తెలిపేలా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీం కోర్ట్ లో ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. అయితే.. ఈ పిటిషన్‌పై ఈరోజు సుప్రీంలో విచారణ జరిగింది. సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. అయితే.. గవర్నర్ వద్ద ఎలాంటి బిల్లులు పెండింగ్‌లో లేవని గరర్నర్ తరఫు న్యాయవాది ధర్మాసనానికి వివరించారు. రెండు బిల్లులపై మాత్రమే అదనపు సమాచారాన్ని ప్రభుత్వం నుంచి కోరామని తెలిపారు.
ఈ అంశంపై మరోసారి విచారణ జరగ్గా.. ఈ నెల 9న గవర్నర్ కార్యాలయం నుంచి ఓ నివేదిక కోర్టుకు అందిందని, దాన్ని సీజేఐ రికార్డు చేసినట్లు పేర్కొన్నారు. మూడు బిల్లులకు ఆమోదం తెలిపారని, కొన్ని బిల్లులపై రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ వివరణ కోరారని.. అదే విషయాన్ని గవర్నర్ కార్యాలయం నివేదికలో పేర్కొన్నట్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఆ తర్వాత ధర్మాసనం పెండింగ్ బిల్లుల విషయంపై విచారణను వాయిదా వేసింది. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి విచారణ జరిగింది. బిల్లులను ఎప్పటికప్పుడు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశిస్తూ.. కేసును ముగిస్తున్నట్లు పేర్కొంది.