గ్రేటర్ కాంగ్రెస్ నేతల చూపు బీజేపీ వైపు అందుకేనా

-

తెలంగాణ కాంగ్రెస్‌కి ఒకటిపోతే మరో సమస్య వచ్చిపడుతోంది. గెలిచిన ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరడంతో కాంగ్రెస్‌కు ఇబ్బందులు మొదలయ్యాయి. ఇప్పుడు బలమైన నాయకత్వం ఉన్న గ్రేటర్ హైదరాబాద్‌ కూడా ఖాళీ అవుతోంది. చివరకు గ్రేటర్ లో నాయకుల కొరత ఏర్పడే పరిస్థితి తయారైన కాంగ్రెస్ నాయకత్వం మాత్రం లైట్ తీసుకుంది. హైదరాబాద్ కాంగ్రెస్ నేతలు బీజేపీ వైపు చూడటానికి కారణమేంటి.

గ్రేటర్ ఎన్నికల్లో 48 కార్పొరేటర్లను బీజేపీ గెలుచుకున్న తరువాత గ్రేటర్లో కాంగ్రెస్ నాయకులంతా బీజేపీ వైపు చూస్తున్నారు. కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ రెండు రోజుల క్రితమే బీజేపీలో చేరారు. రేవంత్ రెడ్డితో కలిసి పార్టీ కార్యాకలపాల్లో చురుగ్గా పాల్గొంటున్న కూన కాంగ్రెస్ సడన్ షాకిచ్చారు. అయితే పార్టీ మారడానికి కూన చెప్పిన కారణాలు కూడా కొంత ఆసక్తికరంగా ఉన్నాయి. పార్టీలో యాక్టివ్ గా ఉన్నా నాయకులను ప్రోత్సహించకపోవడం..రేవంత్ కి పీసీసీ నిర్ణయంలో వెనక్కి తగ్గడం..ఒక్కో నాయకుడిది పార్టీలో ఒక్కో తీరు..మరి పార్టీ గెలిచేదెలా ఇది పార్టీ మారిన తర్వాత కూన శ్రీశైలం గౌడ్ చెబుతున్న మాటలు. ఏది ఏమైనా రాజకీయంగా నిలదొక్కుకోవడానికి… బీజేపీ బలమైన వేదికగా భావిస్తున్నారు కూన. అందుకే హుటాహుటిన ఢిల్లీకి వెళ్లి కాషాయ జెండా కప్పేసుకున్నారు.

గ్రేటర్ ఎన్నికలకంటే ముందే… కొందరు సీనియర్ నాయకులు… కూడా కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంఛార్జి భిక్షపతి యాదవ్..కొడుకు రవి ఇద్దరూ బీజేపీలో చేరిపోయారు. ఇక తెలంగాణ కాంగ్రెస్ కి గ్రేటర్ లో బలమైన నాయకుడైన మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ కూడా కాషాయ జెండా కప్పుకున్నారు. వచ్చే ఎన్నికలనాటికి పోటీలో నిలిచేందుకు ఇప్పుడే పార్టీ మారిపోతున్నారు. హైదరాబాద్‌లో స్థానికులతో పాటు… ఆంధ్రప్రదేశ్ ,ఇతర రాష్ట్రాలనుంచి వచ్చి స్థిరపడినవారు కూడా ఎక్కువే. గోశామహల్, కుత్బుల్లాపూర్ లాంటి నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను ప్రభావితం చేసేస్థాయిలో ఈ ఓటర్లు ఉన్నారు.

ఉత్తరాది వారి ప్రభావం కూడా ఈ నియోజకవర్గాల పరిథిలో ఉంది. దీంతో కుత్బుల్లాపూర్ నుంచి కూన శ్రీశైలం బీజేపీ లో చేరిపోయారు. దీనికి తోడు ముఖేష్ కుమారుడు విక్రమ్ గౌడ్ కూడా దూరదృష్టితో పార్టీ మారిపోయారు. కాంగ్రెస్ నుంచి గోశామహల్లో పోటీ చేసినా అవే ఫలితాలు రిపీట్ అవుతాయనే లెక్కలు వేసుకున్నారు విక్రమ్. బీజేపీలో అదే సీటు ఇచ్చినా, మరోచోట పోటీకి నిలిపిన కలిసి వస్తుందన్న ఆలోచనతో పార్టీ మారినట్లు సమాచారం. కాంగ్రెస్‌లో ఉంటే, లాభంలేదని భావిస్తున్న గ్రేటర్ నేతలు… ప్రత్యామ్నాయ పార్టీల వేటలో పడుతున్నారు. ఇక మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ సైతం తన కూతురు పొలిటికల్ ఫ్యూచర్ కోసం కమలం కండువా కప్పేసుకున్నారు.

ప్రస్తుతం గ్రేటర్ కాంగ్రెస్‌లో ఉన్నదే నాయకులు అంతంత మాత్రం. ఇక మిగిలింది మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ లాంటి కొందరు నాయకులు మాత్రమే. వలసలతో గ్రేటర్లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం బలహీన పడుతోంది. దీంతో పార్లమెంట్ నియోజకవర్గం చొప్పున నాలుగు కమిటీలు వేయాలని చూస్తోంది పార్టీ. అయితే పార్టీ నుంచి వెళ్తున్నవారిని ఆపే ప్రయత్నం చేయకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news