తెలంగాణలో గత రెండేళ్లలో భూగర్భజలాలు పెరిగాయి. 2020తో పోలిస్తే 2022 నాటికి భూగర్భజలాల రీఛార్జి 16.63 శతకోటి ఘనపు మీటర్ల నుంచి 21.11 శతకోటి ఘనపుమీటర్లకు పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ‘డైనమిక్ గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ ఆఫ్ ఇండియా-2022’ నివేదిక వెల్లడించింది. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న భూగర్భజలాల్లో 19.25 శతకోటి ఘనపు మీటర్ల నీటిని తోడుకోవడానికి వీలున్నప్పటికీ ప్రస్తుతం 8 శతకోటి ఘనపు మీటర్లు (41.6%) మాత్రమే వాడుకుంటున్నట్లు తెలిపింది. మొత్తంగా భూగర్భజలాల వాడకం 53.32% నుంచి 41.6%కి తగ్గిపోయినట్లు పేర్కొంది.
ఇందుకు ప్రధాన కారణం మిషన్ కాకతీయ కింద ప్రభుత్వం చేపట్టిన నీటి సంరక్షణ పనులు, సాగునీటి అవసరాల కోసం ఉపరితల జలాల లభ్యత పెరగడం, మిషన్ భగీరథ ద్వారా తాగునీరు సరఫరా చేయడమేనని ఈ నివేదిక వెల్లడించింది. రాష్ట్రంలోని 594 మండలాల్లోని భూగర్భజలవనరులపై అంచనా వేశారు. హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా నీటిని తోడేస్తున్నారని పేర్కొంది. ఇక్కడ వాడుకోవడానికి అందుబాటులో ఉన్న నీటిలో 95%కి పైగా తోడేసుకుంటున్నట్లు ఈ నివేదిక తెలిపింది. రాష్ట్రంలో ఎక్కడా లవణీకరణ ప్రభావం లేదని వివరించింది.