ఉన్నదాన్ని కాపాడుకోవడం.. లేనిదాన్ని సమకూర్చుకోవడం- అనేది ఏ రాజకీయ పార్టీకైనా ముఖ్యం. మరీ ముఖ్యంగా అదికారంపై ఆశలు పెంచుకున్న పార్టీలు మరింతగా ఈ విషయంలో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కానీ, ఏపీ బీజేపీలో ఈ తరహా వ్యూహాలు కనిపించడం లేదు. గతంలో కన్నా లక్ష్మీనారాయణ పార్టీ సారథిగా ఉన్నప్పుడు ఏర్పడిన ఈ గ్రూపుల సంస్కృతి ఇప్పటికీ పార్టీని వెంటాడుతూనే ఉంది. మరింత చిత్రంగా ఇప్పుడు సామాజిక వర్గాల వారీగా కూడా గ్రూపులు ఏర్పడ్డాయి. దీంతో పార్టీలో ఏం జరుగుతున్నా.. వెంటనే మీడియాకు లీకులు వస్తున్నాయి. అదే సమయంలో పార్టీలో ఒకరిని ఎవరైనా కించపరిస్తే.. చంకలు గుద్దుకునే నాయకులు కూడా పెరుగుతున్నారు.
దీంతో రాష్ట్ర బీజేపీ ఒక అడుగు ముందుకు వేస్తే.. నాలుగు అడుగులు వెనక్కి వేయాల్సిన పరిస్తితి వచ్చింది. నిన్న మొన్నటి వరకు పార్టీ తరఫున విచ్చలవిడిగా కార్యక్రమాలు నిర్వహించారు సోము వీర్రాజు. పార్టీ శ్రేణులను కదలించారు. ఉద్యమాలు అన్నారు. చలో అంతర్వేది అన్నారు. మొత్తానికి గుర్రు పెట్టి నిద్రపోతున్న పార్టీ సైన్యాన్ని మేల్కొలిపారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ, దీనిని ఫాలో అప్ చేసుకోవడంలోనే ఆయన విఫలమయ్యారు. ఫర్వాలేదు.. బీజేపీ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా అయినా పోటీ చేసి ఓ పది పదిహేను స్థానాలను కైవసం చేసుకునే రేంజ్‌కు సోము తీసుకువెళ్తారని ఓ మీడియాలో చర్చకు వచ్చింది.
అంతే! ఒక్కసారిగా అందరూ మౌనం పాటించారు. దీనికితోడు.. పురందేశ్వరికి జాతీయస్తాయిలో పార్టీ ఉపాధ్యక్షురాలిగా నియమించడం కూడా పార్టీలో అంతర్గత పోరుకుకారణమైంది. ఈ పదవి కాకపోయినా.. దీనికి సమానమైన పదవిని కాంక్షిన నాయకులు .. తమకు గుర్తింపు లేకుండా పోయిందని ఇంటికే పరిమితమయ్యారు. ఫలింతగా ఎదుగుతున్న బీజేపీకి ఆదిలోనే హంసపాదులు పడ్డాయి. గతంలో కన్నా కూడా రాజధాని విషయంలో ఉద్యమాన్నితీవ్రం చేయాలని, బీజేపీని కదిలించాలని అనుకున్నారు.
అప్పట్లో ఇవే వర్గాలు ఆయనకు సహకరించలేదు. ఈ విషయం సోము తెలిసి.. తాను జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ, అంతర్గతంగా గూడుకట్టుకున్న పదవీ లాలసను, వర్గ పోరును ఆయన పరిష్కరించలేక పోతున్నారనే వాదన ఉంది. ఇది అంతిమంగా పార్టీని డెవలప్ కాకుండా చేస్తోందని అంటున్నారు పరిశీలకులు.
-Vuyyuru Subhash