నీతులు ఎవ్వరయినా చెప్పవచ్చు కానీ నిబంధనలు పాటింపే చాలా కష్టం. కొన్నిసార్లు అసాధ్యం అనుకునేవాటిపై ప్రసంగాలు ఇవ్వకూడదు. కొన్ని సార్లు ఆచరణ సాధ్యం కాని వాటి గురించి మాట్లాడి పరువు పోగొట్టుకోకూడదు. ఆ విధంగా ఇప్పుడు కొడాలి నానిని టీడీపీ మళ్లీ టార్గెట్ చేస్తోంది. మొన్నటి సంక్రాంతి వేళ రేగిన క్యాసినో వివాదం కన్నా ఎక్కువగానే ఈ వివాదం ఉంది. వాస్తవానికి ఇసుక తవ్వకాలు అన్నవి ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా యథేచ్ఛగా సాగిపోయేవే ! వాటికి ఆ పార్టీ ఈ పార్టీ అన్న గోలతో సంబంధం ఉండదు. టీడీపీ హయాంలో నాలుగు డబ్బులు చూసిన వైసీపీ నాయకులు, వైసీపీ హయాంలో నాలుగు డబ్బులు చూసిన టీడీపీ నాయకులు అన్ని చోట్లా ఉంటారు. వీరంతా దిగువ స్థాయికి చెందిన వారు అయినా వీరిని నడిపే వారు మాత్రం ఎమ్మెల్యే మరియు ఎంపీ స్థాయి వ్యక్తులు.
ఎక్కడో ఉన్న నారా లోకేశ్ కు మరెక్కడో ఉన్న ఆమదాలవలస ఇసుక ర్యాంపులకూ ఏంటి సంబంధం ? ఆ రోజు కూడా కూడా చినబాబుపై ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. ఇసుక ర్యాంపుల నిర్వహణలో ఆ రోజు టీడీపీ, ఇప్పుడు వైసీపీ రెండూ కూడా వివాదాల్లో ఇరుక్కున్నవే ! ఇప్పుడు మట్టి తవ్వకాలు కూడా అంతే ! గతంలో ఇవే మట్టి తవ్వకాలకు సంబంధించి తునిలో ఉన్న లీడర్ యనమల రామకృష్ణుడు పై ఓ ప్రముఖ పత్రిక కథనాలు రాసింది. అప్పటికీ
యనమల అధికారంలోనే ఉన్నారు. ఇప్పుడు వైసీపీకి చెందిన కొడాలి నానిపై గుడివాడ కేంద్రంగా ఆరోపణలు వస్తున్నాయి.
అయితే యనమల మనుషులు ఎవ్వరినీ ఆ రోజు గాయ పరిచిన దాఖలాలు లేవు కానీ చింతమనేని మనుషులు మాత్రం ఆ రోజు తెగ రెచ్చిపోయిన వైనం ఒకటి ఆధారంతో సహా వెలుగులోకి వచ్చింది. ఇవే అటు ఇటు తిరిగి వైసీపీ మాట్లాడేందుకు, లేదా టీడీపీ
మాట్లాడేందుకు కారణం అవుతున్నాయి. పార్టీలకు అతీతంగా మాట్లాడుకుంటే ప్రకృతి వనరులను దౌర్జన్యంగా తరలించడమే కాకుండా అడ్డు వచ్చిన వారిని చంపుతాం పొడుస్తాం అని బెదిరించే నాయకులను, రౌడీయిజం చేయకుండా ఉన్న నాయకులను ఇకపై చూడడం కూడా అరుదే ! ఇంకా విచారకర విషయం ఏంటంటే చింతమనేనికి మించిన స్పీడుతో ఇప్పుడు అధికార పార్టీ నాయకులు రెవెన్యూ విభాగ అధికారులను క్షేత్ర స్థాయిలో బెదిరిస్తున్నారు. ఫోన్లలో కూడా తమదైన మాట తీరుతో ముందూ వెనుకా అన్నది చూడకుండా అదే విధంగా అసభ్యకర రీతిలో మాట్లాడుతూ ఉన్నారు. ఇదే ఇప్పుడు రెవెన్యూ వర్గాల భయాలకు కారణం.
ఈ నేపథ్యాన మట్టి తవ్వకాలకు సంబంధించి నిన్నటి వేళ వివాదం రేగింది. గుడివాడకు చెందిన నాని మనుషులు ఆర్ ఐ అరవింద్ పై భౌతిక దాడికి పాల్పడ్డారు అని వార్తలు వస్తున్నాయి. దీనిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇందులో ఆర్ఐ తప్పేమీ లేకపోయినా, నిందితులు తమ వెనుక ఎమ్మెల్యే ఉన్నారన్న ఒకే ఒక్క కారణంతో రెచ్చిపోయారు అన్న టాక్ ఒకటి వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నాయకుల తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇసుక, మట్టి తవ్వకాలను యథేచ్ఛగా సాగిస్తున్న వారిని నిలువరించడం ఓ అధికారి బాధ్యత అని, కానీ ఇదేమని ప్రశ్నించినందుకే ఇష్టం వచ్చిన విధంగా తిట్టడం, తమకు అధికారం ఉందని రెచ్చిపోవడం తగదని విపక్షం హితవు చెబుతోంది.
వాస్తవానికి తాను తహశీల్దార్ నుంచి సమాచారం అందుకునే సంఘటనా స్థలికి చేరుకున్నానని ఆర్ఐ అంటున్నారు. తన పై దాడులు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.ఇక ఈ తగాదాలో నిందితులు అంతా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మనుషులు కావడంతో వివాదం మరింత పెరిగే అవకాశాలే ఉన్నాయి అని తెలుస్తోంది. మంత్రి పదవి నుంచి నానిని తప్పించాక చాలా రోజులుగా ఆయన సైలెంట్ అయిపోయారు. అదేవిధంగా మీడియా ముందుకు వచ్చి అప్పటి మాదిరి వివాదాలకు తావిచ్చే విధంగా మాట్లాడడం లేదు కానీ, మంత్రి పేరుతో రెచ్చిపోతున్న వారిని మాత్రం అటు అధికార గణం కానీ ఇటు పోలీసులు కానీ నిలువరించే ధైర్యం చేయలేకపోతున్నారు. ఒకవేళ అటువంటి ప్రయత్నాలు ఏమి చేసినా భౌతిక దాడులకు సిద్ధం అయ్యే చేయాల్సి వస్తోందని రెవెన్యూ అధికారులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. తమకు ప్రభుత్వమే అండగా ఉండాలని వేడుకుంటున్నారు. గతంలో పశ్చిమగోదావరి జిల్లాలో అప్పటి విప్ చింతమనేని ప్రభాకర్ మాదిరి కొడాలి నాని మనుషులు ప్రవర్తించడంతో మరి ఆ రోజు నీతులు చెప్పిన వారు ఇప్పుడేం అయ్యారు అని నిలదీస్తున్నారు విపక్ష పార్టీ నాయకులు.