నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది.. కాలు జారినా తీసుకోవచ్చు.. నోరు జారితే తీసుకోలేం అన్న సామెతలు ఏపీ మంత్రి కొడాలి నానికి నూటికి నూరు శాతం వర్తిస్తాయి. ఆయన కొద్ది రోజులుగా విపక్ష టీడీపీ, మాజీ సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌పై తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు. వైసీపీ అధిష్టానం కావచ్చు… ఆ పార్టీ కీలక నేతలు కావొచ్చు.. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన నేత, పైగా ఆయన పాత శిష్యుడు కావడంతో ఈ తిట్లను ఎంజాయ్ చేశారో ? లేదా ఎంకరేజ్ చేశారో కాని.. నానిని ఎవ్వరూ ఏమీ అనలేదు. అయితే నాని మరింతగా రెచ్చిపోయి ఏకంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీనే టార్గెట్ చేశారు.
నాని మోదీని టార్గెట్ చేయడంతో వీటిపై బీజేపీ నేతలు నానినే కాకుండా.. అటు ప్రభుత్వాన్ని కూడా టార్గెట్‌గా చేసుకుని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇది వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఇబ్బందిగానే మారింది. దీంతో వాళ్లు నాని మాటలను సరిచేసుకో తప్పని పరిస్థితి. ఈ మాటల తర్వాత పార్టీలకు అతీతంగా సామాన్య ప్రజల నుంచి కూడా తీవ్ర విమర్శలు రావడంతో నాని సొంత పార్టీలో ఏకాకి అయ్యారు. ఈ వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తప్పుబట్టారు. వ్యక్తిగత వ్యాఖ్యలు ఎవరు చేసినా తప్పేనని.. నాని వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవి అని.. మంత్రి నాని విపక్షాల ట్రాప్‌లో పడ్డారని కూడా సెటైర్ వేశారు. ఈ వ్యాఖ్యలను బట్టే నానికి సొంత పార్టీలో కాంట్రవర్సీ వ్యాఖ్యల విషయంలో సపోర్ట్ లేదని అర్థమవుతోంది.
మంత్రి గుమ్మనూరు కూడా ఏకాకేనా…!
ఇక మరో మంత్రి గుమ్మూరు జయరాం సైతం వరుస వివాదాల్లో చిక్కుకోవడంతో ఆయన కూడా ఏకాకి అవుతున్నారు. ఆయన స్వగ్రామంలోనే పేకాట క్లబ్ నిర్వహణలో మంత్రి కజిన్ పేరు బయటకు రావడం ఆ వెంటనే అక్రమంగా భూములు కొన్న విషయంలోనూ ఆయన పేరు బయటకు వచ్చింది. ఆ భూములను కొందరు బలవంతంగా రిజిస్టర్ చేయించుకున్నారని… అందులో కొన్ని నకిలీ పత్రాలు కూడా ఉన్నాయన్న ఆరోపణలు వచ్చాయి. ఇవి ఇలా ఉండగానే తాజాగా ఈఎస్ఐ స్కామ్‌లో నిందితుడిగా ఉన్న కార్తీక్ నుంచి మంత్రి కుమారుడు ఈశ్వర్ బెంజికారు గిఫ్ట్‌గా తీసుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి.
దీనికి సంబంధించిన ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. ఈ ఆరోపణలు తిప్పికొట్టే విషయంలో మంత్రి జయరాంకు మిగిలిన మంత్రులు లేదా పార్టీ నేతలు ఎవ్వరూ సపోర్ట్ చేయడం లేదు. మిగిలిన మంత్రుల సంగతెలాఉన్నా చివరకు కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ నాయకులు మంత్రికి మద్దతుగా నిలవడం లేదని చెవులు కొరుక్కుంటున్నారు. ఏదేమైనా కొడాలి నాని, జయరాం ఏకాకి అయ్యారా ? అన్నదే ఇప్పుడు వైఎస్సార్సీపీ వర్గాల్లో వినిపిస్తోన్న చర్చ..?
-Vuyyuru Subhash