బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీయల్ నరసింహారావు గురువారం ఉదయం బందర్‌రోడ్‌లో వంగవీటి మోహనరంగా విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో వంగవీటి రంగా చరిత్ర అరుదైన సంఘటనగా అభివర్ణించారు. రంగా వ్యక్తిత్వం గురించి, బడుగు బలహీనవర్గాల సేవల గురించి పార్లమెంట్‌లో ప్రస్తావించాను అని గుర్తుచేసుకున్నారు.. భారతదేశ చరిత్రలో రంగా చరిత్ర అరుదైన సంఘటనగా పేర్కొన్న ఆయన.. 3 ఏళ్లలోనే 35 ఏళ్ల ఖ్యాతి సంపాదించారు రంగా అంటూ ప్రశంసలు కురిపించారు.. రాజకీయాలనేవి పార్టీలకు, కులాలకు సంబంధించినవి కావని స్పష్టం చేశారు..
రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇద్దరి పేర్లేనా.. మిగిలినవారి పేర్లు కనిపించవా..? అంటూ అటు అధికార పక్షం, ఇటు విపక్షంపై ఫైర్ అయ్యారు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఏదో ఒక జిల్లాకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు..? అని నిలదీశారు. రాష్ట్రంలో ప్రతి పథకానికి రెండు కుటుంబాల పేర్లు తప్ప మిగిలినవారి పేర్లు పెట్టరా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్ కా విశ్వాస్ అనే నినాదంతో అందర్ని గౌరవించుకోవాలని సూచించారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. కాగా, ఏపీలోని ఓ జిల్లాకు దివంగత వంగవీటి మోహన రంగా పేరును పెట్టాలని జీవీఎల్ నరసింహారావు రాజ్యసభలో డిమాండ్ చేసిన విషయం విదితమే.. రాజ్యసభ జీరో అవర్‌లో మాట్లాడిన ఆయన.. తెలుగు రాష్ట్రాల్లో వంగవీటి మోహన రంగా గురించి తెలియని వారు ఉండరన్నారు. పేదలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు వంగవీటి రంగాను ఆరాధ్య దైవంగా కొలుస్తారన్నారు. ఏపీలో అత్యంత పెద్ద కాపు సామాజికవర్గానికి చెందిన వంగవీటి రంగా.. కేవలం ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యేగా పని చేసినప్పటికీ, గొప్ప ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందారని తెలిపారు.