జనసేన రాజకీయాలు అన్నవి జగన్ కు అడ్డంకిగా ఉన్నాయి.టీడీపీ రాజకీయాలు అన్నవి జగన్ కు అర్థం కావడం లేదు.తగినంత ఆర్థిక బలం ఉన్నా కూడా మీడియా బలం అంతా టీడీపీ కే ఉంది.ఆ బలం ముందు ఇంకా చెప్పాలంటే కొన్ని మీడియాల ఉన్మాదం ముందు తాను చాలనని, తనకు ఉన్న శక్తి చాలదని ఈ మధ్యే ఒప్పుకున్నారు జగన్.అందుకనో ఎందుకనో ఆయన కొన్ని మీడియా సంస్థల పేర్లు చెబితే హడలిపోతున్నారు. చంద్రబాబు అనే వ్యక్తి తన దృష్టిలో నథింగ్ అని ఆయన కన్నా ఆయనకు మద్దతిస్తూ పనిచేసే ప్రసార మరియు ప్రచురణ మాధ్యమాల ఉన్మాదాన్ని తాను నిలువరించలేనని కూడా చెప్పకనే చెప్పారు.
ఈ దశలో మరో కొత్త వ్యూహం ఒకటి అమలు చేసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. ఎలానూ బీజేపీ,పవన్ తో కలిసి చంద్రబాబు తనకు వ్యతిరేకంగా బరిలో ఉంటారు కనుక ఇంకేమయినా రాజకీయ శక్తులను రంగంలోకి దింపి వాటిని తనకు అనుగుణంగా ఏ విధంగా వాడుకోవాలో అన్న విషయమై పరిపరి విధాల యోచన చేస్తున్నారన్నది ఓ ప్రాథమిక సమాచారం.
ఈ తరుణంలో రాజకీయాలు ఎలా ఉన్నా కూడా మార్పును కోరి అయితే లేవు. పరిణామాలు ఎలా ఉన్నా కూడా జనహితం అయితే కోరి లేవు. ఎవరు ఏమనుకున్నా సరే ! ఎవరి దారి వారిదే అన్న విధంగానే రాజకీయాలు ఉన్నాయి.ఆ విధంగా మంచి లేదా ఆవిధంగా చెడు అన్నవి జరిగిపోతూ ఉన్నాయి.ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో జగన్ కు అనుగుణంగా ఫలితాలు ఉండాలంటే ఇంకొన్నిపార్టీలు ఇక్కడికి రావాలి. ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఇంకా చెప్పాలంటే వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చి తద్వారా జగన్ కు మరింత సాయం చేసి పెట్టాలి.ఆ విధంగా జగన్ కు కేజ్రీ సాయం చేయనున్నారు అని తెలుస్తోంది.
ఇప్పటికే బీజేపీ,జనసేనతో టీడీపీ పొత్తు కుదరనుందని తేలిపోయింది.కాంగ్రెస్ ఒకవేళ బరిలో ఉన్నా కూడా ఆ పార్టీ చూపించే ప్రభావం నామ మాత్రమే ! ఇక బీఎస్పీ లాంటి పార్టీల ప్రభావం కూడా పెద్దగా ఆంధ్రాలో లేదు.ఈ సందర్భంలో కేజ్రీ వస్తే తన పార్టీ భావజాలాన్ని విస్తృత రీతిలో వ్యాప్తి చెందిస్తే, తద్వారా జిల్లాలలో ఆ పార్టీ నిలదొక్కుకునే అవకాశాలు లేకపోలేదు. గతంలో లోక్‌సత్తా పార్టీ తరఫున పనిచేసిన వారు ఇప్పుడు కేజ్రీ తరుఫున పనిచేయనున్నారు.అదేవిధంగా కొందరు తటస్థులు బాగా చదువుకున్నవారు కూడా ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి పనిచేయాలనే ఎప్పటి నుంచో సన్నాహాలు చేస్తున్నారు.ఈ తరుణంలో కేజ్రీ ఇక్కడికి వచ్చి తనదైన వ్యూహం ఒకటి అమలు చేస్తే జగన్ కు మేలు చేసిన వారే అవుతారు.
ఎలానూ కేసీఆర్ కూడా ఓ జాతీయ పార్టీ ప్రారంభించాలని అనుకుంటున్నారు కనుక ఆయన కూడా ఓ విధంగా జగన్ కు సాయం చేసిన వారే అవుతారు.వీరే కాకుండా కాపులంతా కలిసి పార్టీ ప్రారంభిస్తే అది కూడా జగన్ కు మేలు చేసే పనే అవుతుంది. ఏ విధంగా చూసుకున్నా చంద్రబాబును నిలువరించేందుకు కేజ్రీ కనుక జగన్ కు సాయం చేస్తే బీజేపీతో ఉన్న స్నేహం కాస్త జగన్ కు చెడుతుంది. అప్పుడు బీజేపీ తనదైన పంథాలో జగన్ కు సంబంధించిన పాత కేసులు అన్నీ తిరగ తోడుతుంది. వాటిని సైతం తట్టుకునే శక్తి తనకు ఉందీ అనుకున్నప్పుడే జగన్ నేరుగా కానీ లేదా తెర వెనుక కానీ ఆమ్ ఆద్మీ పార్టీ ఎదుగుదలకు సాయం చేయాలి.