పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ పై హర్భజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీసీఐ రాజ్యాంగాన్ని కూడా ఖాతరు చేయకుండా పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ చీఫ్ గుల్జారీందర్ చాహల్ అక్రమాలకు పాల్పడుతున్నాడని టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ సంచలన ఆరోపణలు చేశాడు. అధికారాన్ని గుప్పిట్లో ఉంచుకొని అక్రమాలకు పాల్పడితే వదిలేది లేదని హెచ్చరించాడు.
ఈ మేరకు పిసిఏ కు బహిరంగ లేఖ రాస్తూ, ‘ప్రస్తుత పిసిఏ అధ్యక్షుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమాలకు పాల్పడుతున్నాడని గడిచిన వారం పది రోజులుగా పంజాబ్ క్రికెట్ ప్రేమికులు, స్టేక్ హోల్డర్ల నుంచి పలు ఫిర్యాదులు అందుకుంటున్న. ఇది పారదర్శకత, క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని నాకు అనేక ఫిర్యాదులు అందుతున్నాయి.
ఓటింగ్ హక్కులతో దాదాపు 150 మంది సభ్యులను చేర్చుకోవడానికి పిసిఏ తీవ్రంగా ప్రయత్నిస్తుందని తెలుస్తున్నది. ఇది బీసీసీఐ రాజ్యాంగానికి విరుద్ధం. అంతేగాక పిసిఏ మార్గదర్శకాలు, పారదర్శకత ఉల్లంఘన కిందికే వస్తుంది. ఈ వ్యవహారానికి సంబంధించి ఇదివరకే బీసీసీఐ అంబుడ్స్ మెన్ కు ఫిర్యాదులు కూడా అందినట్టు తెలుస్తున్నదని భజ్జి పేర్కొన్నారు.