బీజేపీ, కాంగ్రెస్ నాయకులు సొల్లు మాటలు చెబుతున్నారంటూ విమర్శలు గుప్పించారు మంత్రి హరీశ్ రావు. నేడు ఆయన మంచిర్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు ఒక్క మంచి పని చేసే ప్రయత్నం చేయడం లేదని మండిపడ్డారు. మన కేసీఆర్ చేసిన మంచి పనులు కళ్ల ముందు ఉన్నాయి. ఇది మన కేసీఆర్ గొప్పతనం. చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిని తీసుకొచ్చి తెలంగాణలో ఆ రాష్ట్ర పాలన అమలు చేస్తామని రేవంత్ రెడ్డి చెప్తుండు. ఛత్తీస్‌గఢ్‌లో ఎంత పెన్షన్ వస్తుంది రూ. 500. అంటే తెలంగాణలో ఇస్తున్న రూ. 2016 పెన్షన్ వద్దా..? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఆ రాష్ట్రంలో యాసంగిలో వడ్లే కొనరు. వానా కాలంలో 15 క్వింటాళ్లు మాత్రమే కొంటారు.
ఇది ఛత్తీస్‌గఢ్ పాలన. మన కేసీఆర్ పాలనలో రైతుబంధు, రైతుబీమా పథకాలను అమలు చేయడంతో పాటు పండించిన ప్రతి గింజను మద్దతు ధరకు కొంటున్నామని తెలిపారు. ఆనాడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వ్యవసాయం చేయాలంటే ఎన్నో తంటాలు పడ్డారు. ఎరువులకు, విత్తనాలు దొరక్క ఇబ్బంది పడేవారు. కరెంట్ కోసం తంటాలు, పండిన పంట అమ్ముకోవాలంటే గిట్టుబాటు ధర లేక విలవిలలాడిపోయేవారు. కానీ కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతి గింజను కొంటున్నాం. ఇది మన కళ్ల ముందు కనబడుత లేదా..? అని హరీశ్‌రావు అడిగారు. ఛత్తీస్‌గఢ్, బీహార్ నుంచి తెలంగాణకు వలస వస్తున్నారు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నందుకే ఇక్కడికి వస్తున్నారు. రేపు తెలంగాణలో ఛత్తీస్‌గఢ్ పాలన అమలైతే.. మనోళ్లు కూడా వలస పోవాలా? అని ప్రశ్నించారు.