తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మరో సరి ఆగ్రహం వ్యక్త చేశారు. పేద, మధ్య తరగతి ప్రజలకు వ్యతిరేకంగా బీజేపీ పాలన సాగుతోందని ఆందోళన తెలియపరిచారు మంత్రి హరీష్. ప్రజల ప్రాణాలను కాపాడే ఔషధాల ధరలను 12 శాతం పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం ఎంతో దారుణమని మండిపడ్డారు ఆయన. పేద, మధ్య తరగతి ప్రజలకు ఇది ముమ్మాటికీ వైద్యాన్ని దూరం చేయడమేనని తెలిపారు. యాంటీ ఇన్ఫెక్టివ్, యాంటీ బయోటిక్స్, పెయిన్ కిల్లర్లు, జ్వరం, ఇన్ఫెక్షన్స్, చర్మ వ్యాధులు, ఎనీమియా తదితర చికిత్సల్లో వినియోగించే మెడిసిన్స్ ధరలను పెంచితే అది పేద, మధ్య తరగతి ప్రజలకు మరింత భారం అవుతుందని తెలియచేశారు మంత్రి హరీష్.
అవకాశం దొరికిన ప్రతిసారి పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచుతుందని మంత్రి హరీశ్ మండిపడ్డారు . సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టడాన్నే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు ఆయన. బీజేపీ చెపుతున్న అమృత్ కాల్ అంటే ఇదేనా అని ప్రశ్నించారు ఆయన. అచ్చే దిన్ అంటే ఇది కాదని… ఇది సామాన్యుడు సచ్చే దిన్ అని అన్నారు. మన దేశంలో బీజేపీ పాలనకు రోజులు దగ్గర పడ్డాయని తెలిపారు మంత్రి హరీష్.