కరోనా మహమ్మారి వలన చాలా మంది సమస్యలను ఎదుర్కొన్నారు. అనేక మంది పిల్లలు తల్లిదండ్రులను కూడా కోల్పోయారు. కొందరైతే ఉపాధిని కోల్పోయారు. దీనితో చాలా మంది విద్యార్థులు చదువుకోలేకపోతున్నారు. అందుకని ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ స్కాలర్‌షిప్ ప్రకటించింది.
ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. బడ్డీ ఫర్ స్టడీ సంస్థతో కలిసి ‘బాధ్తే కదమ్’ స్కాలర్షిప్కు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. భారతదేశంలోని గుర్తింపు పొందిన పాఠశాలల్లో 9 నుంచి 12 తరగతి చదువుతున్న విద్యార్థులు దీనికి అర్హులు.
ఎంపికైన వారికి ఏటా రూ. 20,000 స్కాలర్‌షిప్ వస్తుంది. ఫిబ్రవరి 15లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఇక అర్హత విషయంలోకి వస్తే.. దరఖాస్తుదారుల కుటుంబ వార్షిక ఆదాయం రూ. 6 లక్షల కంటే మించకూడదు. పాఠశాలల్లో 9 నుంచి 12వ తరగతి చదువుతూ ఉండాలి.
కరోనా సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన వారు, మహమ్మారి వలన ఉపాధి కోల్పోయిన వారి పిల్లలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రభావితమైన కుటుంబాలకు చెందిన పిల్లలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారి పిల్లలు, శారీరక వికలాంగ విద్యార్థులు దీనికి అర్హులు.
ఎంపికైన గ్రామీణ విద్యార్థులు రూ. 15,000, పట్టణ విద్యార్థులు రూ. 20,000 వరకు స్కాలర్‌షిప్ వస్తుంది. విద్యార్థుల ట్యూషన్ ఫీజులు, హాస్టల్ ఫీజులు, డేటా రీఛార్జ్‌లు, ఆన్‌లైన్ లెర్నింగ్ డివైజ్‌లు, పుస్తకాలు, స్టేషనరీ మొదలైన వాటిని ఈ స్కాలర్ షిప్ కవర్ చేస్తుంది. అదే విధంగా ఎంపికైన విద్యార్థుల మానసిక ఆరోగ్యం కోసం వెల్నెస్ కౌన్సెలింగ్, కెరీర్ కౌన్సెలింగ్, మెంటర్‌షిప్ వంటివి కూడా ఇస్తుంది. Buddy4Study వెబ్‌సైట్‌కి వెళ్లి మీరు దరఖాస్తు చేసుకోచ్చు.