ఆరెంజ్ కలర్లో ఉండి తింటుంటే సుతి మెత్తగా లోపలికి వెళ్లే బొప్పాయిపండు తనదైన రుచిని కలిగి ఉంటుంది. ఇతర పండ్లకన్నా భిన్నమైన రుచిని బొప్పాయి పండు అందిస్తుంది. బొప్పాయి పండ్లలో ఫోలేట్, ఫైబర్, ప్రోటీన్లు, విటమిన్ ఎ, సి, మెగ్నిషియం, పొటాషియం, బీటా కెరోటీన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఈ పండ్లు మనకు ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి.
బొప్పాయి పండ్లలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. కళ్లకు ఎంతగానో మేలు చేస్తుంది. కళ్లలో శుక్లాలు రాకుండా ఉంటాయి. వయస్సు పెరిగేకొద్దీ రెటీనా దెబ్బతినకుండా ఉంటుంది. విటమిన్ ఎ ఉన్నందున కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. తరచూ తింటుంటే కంటి చూపు పెరుగుతుంది. కళ్లకు రక్షణ లభిస్తుంది. దృష్టి లోపం రాకుండా ఉంటుంది.
బొప్పాయి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఏర్పడే ఫ్రీ ర్యాడికల్స్ కు వ్యతిరేకంగా పోరాడుతాయి. అందువల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. బొప్పాయి పండ్లలో ఉండే కెరోటినాయిడ్స్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ ర్యాడికల్స్‌ను తటస్థ పరుస్తాయి. బొప్పాయి పండ్లలో ఉండే లైకోపీన్ శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం ఉన్నందున బొప్పాయి పండ్లు గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. వీటిలో ఉండే విటమిన్ సి, లైకోపీన్‌లు గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. గుండె జబ్బులు రాకుండా చూస్తాయి.
జీర్ణసమస్యలు ఉన్నవారు బొప్పాయి పండ్లను తినడం మంచిది. దీని వల్ల జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది. గ్యాస్, మలబద్దకం తగ్గుతాయి. పెద్దపేగు క్యాన్సర్ రాకుండా ఉంటుంది. అలాగే ఈ పండ్లలో ఉండే పపైన్ అనబడే ఎంజైమ్ ప్రోటీన్లను సులభంగా జీర్ణం చేస్తుంది. దీంతో శరీరానికి శక్తి లభిస్తుంది.
గమనిక: పైన పేర్కొన్న అంశాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.. ఆరోగ్యపరమైన సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించగలరు.