భాగ్యనగరంలో నేడు వాతావరణంలో మార్పులు వెనువెంటనే చోటు చేసుకున్నాయి. మధ్యాహ్న 3 గంటల వరకు భగ్గుమన్న భానుడు.. ఆ తరువాత చల్లబడ్డాడు. దీంతో ఒక్కసారిగా హైదరాబాద్ వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈదురుగాలులుతో కూడిన వర్షం కురిసింది. భారీ ఈదురు గాలులకు నాంపల్లిలో ఓ భవనంపై ఉన్న ఇనుప రేకులు ఎగిరిపోయాయి. దీంతో మూడు కార్లు ధ్వంసం అయ్యాయి. ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.
గచ్చిబౌలి, తెల్లాపూర్, నార్సింగి, మణికొండ, గండిపేటతో పాటు సమీప ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. చంపాపేట్, కర్మన్‌ఘాట్, సరూర్ నగర్, సైదాబాద్, అంబర్‌పేటలోనూ వర్షం కురిసింది. పశ్చిమ హైదరాబాద్ ప్రాంతమంతా మేఘాలు కమ్ముకున్నాయి. బండ్లగూడ జాగీర్ మున్సిపాలిటీ ఏరియాలో చాలా రోజుల తర్వాత కుండపోత వర్షం పడింది. గండి మైసమ్మ, బాచుపల్లి, అమీన్‌పూర్, నిజాంపేట్ ఏరియాల్లో రాబోయే 30 నిమిషాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.