జనగామ జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొలనపాక – బచ్చన్నపేట మధ్యలో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. స్కూటీ పై బచ్చన్నపేటకు వెళుతున్న టీచర్ ఈ ప్రవాహంలో స్కూటీతోపాటు కొట్టుకుపోయారు. అక్కడే ఉన్న స్థానికులు వెంటనే అప్రమత్తమై టీచర్ ని కాపాడారు. జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు పలుచోట్ల వాగులు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల చెరువులు, కుంటలు, మత్తడి పోస్తున్నాయి.
జనగామ – హుస్నాబాద్ ప్రధాన రహదారి, జనగామ మండలం వడ్లకొండ వద్ద ఉన్న కాజు వే పై వాగు ఉదృతంగా ప్రవహిస్తుంది. దీంతో వాహనాల రాకపోకలు బంద్ అయ్యాయి. సర్పంచ్ ఆధ్వర్యంలో ముందస్తుగా రోప్ సహాయక చర్యలు ఏర్పాటు చేశారు. పొంగిపొర్లుతున్న వాగుల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టణంలోని కురుమవాడ, బాలాజీ నగర్, జ్యోతి నగర్, శ్రీనగర్ కాలనీలో వరద నీరు చేరి జలమయమయ్యాయి.