Telangana : రాష్ట్రంలో నేడు, రేపు వడగళ్ల వర్షాలు

-

రాష్ట్రంలో ఇవాళ, రేపు మరోసారి వర్షం బీభత్సం సృష్టించనుంది. ఇప్పటికే అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరోసారి వరణుడు వారిపై మరింత భారాన్ని మోపేందుకు సిద్ధమవుతున్నాడు. రాష్ట్రంలో శుక్ర, శనివారాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం  పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు తెలిపింది.

రాష్ట్రంలోని పెద్దపల్లి, కుమురంభీం ఆసిఫాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో గురువారం రోజున  వర్షాలు కురిశాయి. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవడం వల్ల పలు జిల్లాల్లో పంటలు నేలకొరిగాయి. మామిడి, నిమ్మ వంటి పంటలు నేలరాలాయి. ఈదురుగాలుల వల్ల విద్యుత్ స్తంభాలు, భారీ వృక్షాలు కూలిపోయాయి. దీనివల్ల పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.

ఇక ఇప్పటికే కురిసిన వర్షాల వల్ల చాలా ఎకరాల్లో వరి, మొక్కజొన్న పంట నీటిపాలైన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నష్టపోయిన పంట పొలాలను పరిశీలించి రైతులకు రూ.10వేల పరిహారం ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news