రెండు రోజులు బ్రేక్ ఇచ్చిన వరణుడు డబుల్ స్పీడ్‌తో దూసుకొచ్చాడు. సోమవారం అర్ధరాత్రి హైదరాబాద్‌లో వర్షం దంచికొట్టింది. రాత్రి 12 దాటాక మొదలైన వాన.. ఎడతెరిపిలేకుండా ఉదయం 4 గంటల వరకు కురుస్తూనే ఉంది.
నగరంలోని.. ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, నాంపల్లి, పాతబస్తీ, కోఠి, ఆబిడ్స్, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్, ముషీరాబాద్, కాప్రా, హెచ్‌బీ కాలనీ, కుషాయిగూడ, రాయదుర్గం, ఖాజాగూడ, కొత్తపేట, ఎల్బీనగర్, హయత్‌నగర్, హిమాయత్‌నగర్, నారాయణగూడ తదితర ప్రాంతాల్లోని ప్రధాన రహదారులపై మోకాల్లోతు నీరు నిలిచింది. ఇప్పటికే చెరువులన్నీ దాదాపు నిండిపోవడంతో తాజా వర్షాలతో లోతట్టు ప్రాంతాల ప్రజలు భయంభయంగా గడుపుతున్నారు.
ఊహించని విధంగా కురిసిన వర్షానికి, అర్ధరాత్రి సమయంలో ఇళ్లకు వెళుతున్నవారు తడిసి ముద్దయి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో వర్షంలోనే ఫలహారం బండ్ల ఊరేగింపు నిర్వహించారు. తెల్లవారుజామున పనుల మీద బయటకు వెళ్లే వారు రహదారులపై నిలిచిన నీరు చూసి షాక్ అయ్యారు. చెరువును తలపిస్తున్న రోడ్లతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.