ఉమ్మడి మెదక్ జిల్లాలో వానలు దంచికొడుతున్నాయి. శివ్వంపేట మండలంలో కుండపోత వర్షం కురుస్తోంది. భారీ వర్షాలతో కుంటలు, వాగులు, చెరువులు అలుగు పారుతున్నాయి. వర్షం ధాటికి శివ్వంపేటలో రామాలయం ప్రహరీ గోడ, పురాతన బురుజు గోడ కూలాయి. మరోవైపు జిల్లా వ్యాప్తంగా వర్షం బీభత్సం సృష్టించడంతో అధికారులు ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
మాసాయిపేట మండలంలో హల్దీ ప్రాజెక్టు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్లో హల్తీ వాగు వంతెనపై వరద నీరు చేరింది. దీంతో ఎలాంటి ప్రమాదాలు జరగకూడదని అధికారులు వంతెనపై రాకపోకలు నిలిపివేసి బారికేడ్లు ఏర్పాటు చేశారు. మరోవైపు వెల్దుర్తి కుడి చెరువు మత్తడి పారుతోంది.
సింగూరు గేట్లు ఎత్తడంతో వనదుర్గ ప్రాజెక్టు పొంగిపొర్లుతోంది. కొల్చారంలో భారీ వర్షానికి కోతుల చెరువు అలుగు పారుతోంది. హవేలీ ఘనపూర్-గంగాపూర్ మధ్య వంతెన కూలిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పనుల మీద బయటకువెళ్లేవారు దారిలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాన కురిసిన ప్రతిసారి తమకు ఇవే పరిస్థితులు ఎదురవుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. ఈసారైనా శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.