ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాజధాని విషయంలో ఊహించని షాక్ తగిలింది. కర్నులుకి కార్యాలయాల తరలింపు విషయంలో హైకోర్ట్ షాక్ ఇచ్చింది. అమరావతిలోని విజిలెన్స్ కమిషన్ కార్యాలయం, కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ కార్యాలయాలను కర్నూలుకు తరలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జీవో నెంబర్ 13ను జారీ చేయగా ఆ జీవోని ఏపీ హైకోర్ట్ సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వం జనవరి 31న జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ తాళ్లాయపాలెం గ్రామానికి చెందిన రైతు కొండేపాటి గిరిధర్, అమరావతి పరిరక్షణ సమితి కార్యదర్శి తిరుపతిరావు వేర్వేరుగా దాఖలు చేసిన పిటీషన్లపై విచారణ జరిపిన కోర్ట్ జీవో ని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. పరిపాలనా సౌలభ్యం కోసం అని రాష్ట్ర ప్రభుత్వం కార్యాలయాలను కర్నూలుకి తరలించాలని ఆదేశాలు ఇచ్చింది.
అవి దురుద్దేశం తో కూడుకున్నవని పిటీషనర్ ఆరోపించారు. విజిలెన్సు కమీషనర్ ఆఫీస్ ను కర్నూలుకు తరలించడం పై విడుదల చేసిన జీవో13 పై చీఫ్ సెక్రటరీ సంతకం లేదని, సచివాలయం అధికారుల రోజువారీ పనిని గమనించడానికి ఏర్పాటు చేసిన విజిలెన్స్ కమిషన్ ఆఫీస్ ను సచివాలయానికి దూరంగా మార్చడం దురుద్దేశంతో కూడుకుందన ఆరోపిస్తూ… హైకోర్టు న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ బాబు పిటిషన్ వేయగా ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్ట్ తరలించవద్దని తీర్పు ఇచ్చింది.