ఏపీ ప్రభుత్వం పేద ప్రజలకు మరో శుభవార్త చెప్పింది. వైసీపీ ప్రభుత్వం నవరత్నాల్లో భాగంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇళ్లు నిర్మాణానికి ఎటువంటి షరతుల్లేకుండా రుణాలు మంజూరు చేయడానికి బ్యాంకులు ముందుకు వచ్చాయి. ఈ పథకం కింద ఇంటి రుణం తీసుకునే వారికి సిబిల్ స్కోర్ నుంచి కూడా మినహాయిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది రాష్ట్ర బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ). వైఎస్సార్ జగనన్న కాలనీల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా 30.75 లక్షల మంది పేదలకు సొంతింటి కలను నిజం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే.
కానీ, దీనికి గృహ రుణం మంజూరులో కీలకమైన సిబిల్ స్కోర్ అడ్డంకిగా మారింది. ఇదే విషయాన్ని గత ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకుల దృష్టికి తీసుకెళ్లింది. ప్రైవేటు బ్యాంకులతో సహా అన్ని బ్యాంకులు జగనన్న కాలనీలకిచ్చే ఇంటి రుణాలను సిబిల్ స్కోర్ నుంచి మినహాయించాలని కోరింది. ఈ అంశాన్ని పరిశీలించిన ఎస్‌ఎల్‌బీసీ.. ఏపీ టిడ్కో, పీఎంఏవై, వైఎస్సార్ జగనన్న కాలనీల్లో నిర్మిస్తున్న ఇళ్లకు ఇచ్చే రుణాలను సిబిల్ స్కోర్ నుంచి మినహాయింపునిస్తూ ఆదేశాలు జారీచేసింది. కానీ, అప్పటికే బ్యాంకుకు రుణం ఎగ్గొట్టిన వారికి ఈ మినహాయింపు వర్తించదు.