కర్ణాటక రాష్ట్రంలో వరణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. ముఖ్యంగా బెంగళూరును భారీ వర్షాలు బెంబేలెత్తిస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న ఈ భారీ వానలకు కాలనీల్లోకి, ఇళ్లల్లోకి వరదనీరు పోటెత్తుతుండటం వల్ల జనజీవనం అతలాకుతలమైంది. గత కొన్ని రోజులుగా వర్షం పడుతుండటం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది.
ఇళ్లలోకి నీళ్లు చేరడం వల్ల కొందరు హోటళ్లను ఆశ్రయిస్తున్నారు. వరదలు ముంచెత్తడం వల్ల బెంగళూరులో హోటళ్లలో గదుల టారిఫ్‌లు అమాంతం ఆకాశాన్ని తాకుతున్నాయి. ఐటీ హబ్‌లో వరదలు, నీటి ఎద్దడి కారణంగా అనేక కుటుంబాలు హోటళ్లకు మకాం మార్చమే ఈ డిమాండ్‌కు కారణం. పాత విమానాశ్రయం రోడ్డులోని ఎల్‌బీ శాస్త్రినగర్‌లో చాలా అపార్ట్‌మెంట్లకు నీటి సరఫరా, విద్యుత్తు నిలిచిపోవడంతో వారంతా హోటళ్లలో తలదాచుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో హోటళ్ల టారిఫ్‌లు పెరిగిపోయాయి.
సాధారణంగా రూ.10వేల నుంచి 20వేల మధ్య ఉన్న ఈ ధరలు తాజా పరిస్థితుల నేపథ్యంలో కొన్ని చోట్ల ఒక రాత్రికి రూ.30 వేలు నుంచి 40వేల వరకు పలుకుతున్నట్టు సమాచారం. వరదలకు దెబ్బతిన్న వైట్‌ఫీల్డ్, అవుటర్ రింగ్ రోడ్డు, ఓల్డ్ ఎయిర్ పోర్టు రోడ్డు, కోరమంగళ తదితర ప్రాంతాల్లోని అనేక హోటళ్లలో శుక్రవారం వరకు గదులన్నీ బుక్ అయిపోయినట్టు తెలుస్తోంది.